calender_icon.png 14 July, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్కటైన థాకరేలు

08-07-2025 12:00:00 AM

మహారాష్ట్రలో థాకరేలు ఒక్కటయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో రానున్న రోజుల్లో కొత్త సమీకరణాలకు అన్నదమ్ముల కలయిక కొత్త అధ్యాయాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. శివసేన అధినేత బాల్ థాకరే వైపే మొగ్గు చూపారు. దీంతో ఇరవై ఏళ్ల క్రితం రాజ్ థాకరే, తన పెదనాన్న పార్టీ వీడి నవ నిర్మాణ సేనను స్థాపించారు. బాల్ థాకరే మార్గంలో మరాఠీల పక్షాన నిలిచి, పలు ఆందోళనలు చేసిన నవనిర్మాణ సేన ఆ తర్వాత ప్రాభవాన్ని కోల్పోయింది. 

శివసేన నాయకునిగా ఉద్ధవ్ థాకరేకు మరాఠీలు పూర్తి మద్దతునిచ్చినా అసెంబ్లీకి గతంలో జరిగిన ఎన్నికల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. గతంలో బీజేపీతో, ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్నా శివసేనకు లాభం కంటే, నష్టమే ఎక్కువ జరిగింది. ‘మరాఠీ ప్రైడ్’ అంటూ ఆరు దశాబ్దాల క్రితం మరాఠీల భాష, సంస్కృతి, సంప్రదాయాలు, ఉపాధి రక్షణగా వచ్చిన ఉద్యమాలు దేశవ్యాప్తంగా గుర్తింపునిచ్చాయి.

మహారాష్ట్రలో గుజరాతీలకు అడ్డుకట్ట వేసేందుకు భాషా ప్రతిపాదికన మరాఠీలు సొంత రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నా, గుజరాత్‌కే పలు ప్రాజెక్టులు వెళ్తున్నాయని గుర్రుగా ఉన్నారు. ప్రాంతీయ వాదం, ఆ మాటకొస్తే ఉప జాతీయ భావనతో మరాఠాలను ఉద్రేకపరిచిన శక్తిగా బాల్ థాకరే తన శివసేనకు గుర్తింపు తెచ్చారు. ఆ ప్రాంతీయ వాదమే తొలినాళ్లలో దక్షిణాది వారిపై, ఆ తర్వాత హిందీ రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు, ముఖ్యంగా మంబైకి వలస వచ్చే వారిపై అస్త్రాలను ఎక్కుపెట్టేలా చేసింది.

ఇతర రాష్ట్రాల నుంచి వలసల వల్ల మరాఠీలు ఉపాధి కోల్పోతున్నారనేది పలు ఆందోళనలకు తావిచ్చింది. ప్రభుత్వ రంగంలో, బ్యాంకింగ్ రంగంలో దక్షిణాదివారు, మహారాష్ట్ర యువత అవకాశాలను కొల్లగొడుతున్నారని ‘బజావో పుంగీ, హటావో లుంగీ’ అనే నినాదం మార్మోగింది.

ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారు ముంబై విడిచి వెళ్లాలనే హెచ్చరికల దాకా శివసేన, నవనిర్మాణ సేన ప్రాంతీయ రాజకీయాలు పయనించాయి. మరాఠీలు, ముఖ్యంగా యువత ఆ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా, మరాఠీ భాష ‘సేన’లకు కొత్త వేదికనిచ్చింది. ఐదేళ్ల క్రితం కేంద్రం తెచ్చిన నూతన విద్యావిధానం దేశమంతటా పాఠశాలల్లో హిందీతో పాటు త్రిభాషా సిద్ధాంతాన్ని అమలు చేయాలని సిఫార్సు చేసింది. ఇది హిందీ భాషను తమపై రుద్దడమేనని దక్షిణాది రాష్ట్రాలు నిరసన తెలుపుతున్నాయి. ఇంగ్లిష్, మరాఠీ మీడియం స్కూళ్లలో  ఒకటి నుంచి ఐదో తరగతి వరకు హిందీ మూడో భాషగా, తప్పనిసరిగా బోధించాలని బీజేపీ నాయకత్వంలోని ‘మహాయుతి’  ప్రభుత్వం తీర్మానించింది. దీనిపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో జూన్ 29న రాష్ట్ర క్యాబినెట్ దానిని ఉపసంహరించుకున్నది.

భాషా సమస్యపై రాజ్, ఉద్ధవ్  ఒక్కటిగా ఉద్యమించనున్నారనే వార్తల మధ్య రాష్ట్రప్రభుత్వం వెనక్కి తగ్గిందనేది వాస్తవం. ఇది తమ విజయంగా ‘సేన’ల నాయకుల ప్రక టించుకున్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం హిందీ భాషను రుద్దాలని చూస్తున్నదని మొదటి నుంచి ఆందోళన చేస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్, థాకరే సోదరుల కలయికను, ప్రాంతీయ భాష పరిరక్షణ చట్రంలోనే చూశారు. హిందీకి వ్యతిరేకంగా థాకరే సోదరులు నడుంబిగిం చారని స్టాలిన్ ఆనందం వ్యక్తం చేసినా, అది కొన్ని గంటలైనా నిలువలేదు.

హిందీకి తాము వ్యతిరేకం కాదని, స్కూళ్లలో దానిని తప్పనిసరి చేయడాన్నే వ్యతిరేకిస్తున్నామని శివసేన స్పష్టం చేయడం ద్వారా స్టాలిన్‌ను దూరం పెట్టినట్టయింది. రానున్న ముంబై మున్సిపల్ ఎన్నికలు మొదలు, అసెంబ్లీ ఎన్నికల దాకా థాకరే సోదరుల కలయిక ప్రభావం ఏమిటనేది చూడాల్సిందే.