calender_icon.png 5 August, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ కేసు

31-07-2025 01:24:30 AM

-నిందితుల కస్టడీ తీర్పు నేటికి వాయిదా

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అక్రమాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. అనుమతులు లేకుండా సరోగసీ చేయడంతో పాటు, అక్రమంగా వీరాన్ని సేకరించిన కేసులో ప్రధాన నిందితులైన డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత్‌లను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు గురువారానికి వాయిదా వేసింది.

కస్టడీ కోరిన పోలీసులు..

ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరిపి, అక్రమాల వెనుక ఉన్న పూర్తి వివరాలను బయటపెట్టేందుకు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత్‌లను వారం రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు. కస్టడీ పిటిషన్‌పై ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. పోలీసులు సమర్పించిన ఆధారాలు, ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న సికింద్రాబాద్ కోర్టు, డాక్టర్ నమ్రత, జయంత్‌ల కస్టడీపై గురువారం తీర్పు ప్రకటించనున్నట్టు స్పష్టం చేసింది.

అక్రమాల పర్వం వెలుగులోకి..

సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదులు అందడం తో రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చా యి. సెంటర్ నిర్వాహకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లోని ఫుట్‌పాత్‌లపై నివసించే బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఆశచూపి, చదువుకున్న వారికి రూ.4 వేలు చెల్లించి, పోర్న్ వీడియోలు చూపించి అక్రమంగా వీర్యం సేకరించినట్టు గుర్తించారు. అంతేకాకుండా, అండాల సేకరణ కోసం మహిళా అడ్డా కూలీలకు డబ్బులు చెల్లించినట్టు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది.