11-07-2025 12:37:32 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 10 (విజయక్రాంతి): జీవో 49 విషయంలో కేం ద్రంపై కాంగ్రెస్ బిఆర్‌ఎస్‌లు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలని పార్లమెంటు సభ్యులు జి నగేష్ అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో 49 విషయంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.
2014 లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు బెజ్జూర్ రేంజ్ పరిధిలో రాబందులు ఉన్నాయని వాటిని కాపాడుకోవాలని 2014లో నివేదికను అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ సిఎఫ్‌కు పం పించడం జరిగిందన్నారు. తాజాగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గత జూన్ మాసంలో జీవో 49 తెచ్చిందన్నారు.
ఇటీవల జిల్లాకు వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు సైతం తాను సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు జీవో 49 రద్దు చేయాలని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మీనా వేషాలు మానుకొని జీవో 49 ను రద్దు చేయాలన్నారు. జీవో 49 కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని కేంద్రంపై నెట్టివేయడం సరైనది కాదన్నారు.
జిల్లా ప్రజలు తప్పుడు మాటలను నమ్మవద్దన్నారు. కరోనా సమయంలో జర్నలిస్టులకు నిలిపివేసిన రైల్వే పాసులను పునరుద్ధరించాలని ఎంపీ దృష్టికి తీసుకురాగా ఈ విషయమై తాము ఎంపీల తో చర్చించుకుంటున్నామని త్వరలోనే పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు.
అనంతరం ఇటీవల ఎన్నికైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాల్, శ్రీనివాసరావు, సాయి, సదాశివులను ఎంపీ నగేష్ బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సమావే శంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం నాయకులు కోట్నాక విజయ్, అరిగెల మల్లికార్జున్, చర్ల మురళి, సొల్లు లక్ష్మి ,కాండ్రె విశాల్ తదితరులు పాల్గొన్నారు.