21-11-2025 01:16:47 AM
-కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఆమోదాన్ని స్వాగతిస్తున్నా
-రాష్ర్టంలో ఆర్కే (రేవంత్‌రెడ్డి, కేటీఆర్) పాలన
-కమ్యూనిస్టులు, అర్బన్ నక్సల్స్ మాయమాటలు నమ్మి అమాయకులు అడవుల్లో తిరుగుతూ చస్తున్నారు
-కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాం తి): అవినీతికి పాల్పడే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ ప్రభుత్వం సహించదని, కచ్చితంగా చర్యలుంటాయని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో మాజీమంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతివ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తారో చూద్దామన్నారు. ఇన్నాళ్లు బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అని ఎన్నికలకు ముందు ఆరోపించిన సీఎం ఇప్పుడేమంటా రు? అని ఆయన నిలదీశారు.
రాష్ర్టంలో ఆర్కే (రేవంత్ రెడ్డి, కేటీఆర్) పాలన కొనసాతోందన్నారు. ‘సోకాల్డ్ కమ్యూనిస్టులు, అర్బన్ నక్సల్స్ లారా...కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీకు కనిపించడంలేదా?’ అని పేర్కొన్నారు. అమాయకులను రెచ్చగొట్టి ఆయుధాలు చేతపట్టించి వారి చావులకు కారకులైన అర్బన్ నక్సల్స్ సాధించిందేమిటని ప్రశ్నించారు. బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో గురువారం బీజేపీ రాష్ర్ట నేతలు జి.మనోహర్ రెడ్డి, ఎస్. కుమార్, డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, డాక్టర్ శిల్పారెడ్డి, తదితరులతో కలిసి కేంద్ర మంత్రి బండి సం జయ్ మీడియాతో మాట్లాడారు. అవినీతిపరుల ఆస్తులు జప్తు చేస్తానని గతంలో సీఎం అన్నారని, ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చారు కదా... సీఎం ఏం చేస్తారో చూడాలన్నారు.
ఏసీ గదుల్లో ఎంజాయ్ చేస్తున్నారు!
కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎగ్గొట్టారు? భూములిచ్చారా? ఉద్యోగాలిచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? మహిళలకు ప్రతినెలా రూ.2500లు ఇచ్చారా? వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చారా? మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘మీకు నచ్చింది’ ఏమిటి? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు తీసుకుని భాగస్వాములు అవుతున్నారో చెప్పాలన్నా రు.
ఆయుధం పట్టిన వాళ్లకు ఆనందం ఉండదని, జీవితాంతం టెన్షనేనని, తిండీతిప్పలు లేక కుటుంబ సభ్యులకు దూరమై అల్లాడుతుంటే అర్బన్ నక్సలైట్లు మాత్రం ఏసీ గదుల్లో ఎంజాయ్ చేస్తూ మావోయిజం వర్ధిల్లాలని, తాడిత పీడిత వర్గాలు ఏకం కావాలంటూ మాయ మాటలు చెబుతూ పబ్బం గడు పు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరవీలు చేసుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు.
రాజమౌళిని దేవుడు కరుణించాలి
‘దేవుడు కరుణించి భవిష్యత్‌లో రాజమౌళి దేవుడిని నమ్మే విధంగా మార్చాలి. ఆయన కరుణా కటాక్షాలు రాజమౌళిపై ఉండాలి’ అని కోరుకుంటున్నానని బండి సంజయ్ తెలిపారు. సినీ దర్శకుడు రాజమౌళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తనదైనశైలీలో స్పందిస్తూ సెటైర్లు వేశారు. రాజమౌళి నిండు నూరేళ్లు బతికి మంచిగా సక్సెక్ అవ్వాలని అమ్మవారిని కోరుతున్నానని పేర్కొన్నారు.