21-11-2025 01:11:40 AM
- ఇదిగో, అదిగో అంటూ కాలయాపన
- ఆశావహుల్లో అసహనం
- పంచాయతీ ఎన్నికల ముందు ప్రకటించేనా?
మేడ్చల్, నవంబర్ 20 (విజయ క్రాంతి): జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎంపికపై తీవ్ర కాలయాపన జరుగుతోంది. ఇదిగో, అదిగో అంటూనే కాలయాపన చేయడంతో ఆశవహుల్లో, కాంగ్రెస్ శ్రేణుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. డిసిసి అధ్యక్షులను ఎప్పుడో ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ ఏదో ఒక కారణంతో వాయిదా పడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తదితర కారణాల వల్ల కాంగ్రెస్ అధిష్టానం డిసిసి అధ్యక్షులను ప్రకటించడం లేదు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఊపు మీద పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికలకు ముందు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజా పాలన వారోత్సవాలు నిర్వహించనుంది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల సందడి మొదలుకానుంది. పంచాయతీ ఎన్నికల కంటే ముందే డిసిసి అధ్యక్షులను ప్రకటిస్తారని ఆశావాహులు ఆశాభావంతో ఉన్నారు. కొత్త అధ్యక్షులతో పంచాయతీ ఎన్నిక లకు వెళ్తుందని భావిస్తున్నారు.
కసరత్తు పూర్తి
డిసిసి అధ్యక్షుల ఎంపిక విషయంలో అధిష్టానం కసరత్తు పూర్తి చేసింది. సామాజిక వర్గం ఆధారంగా డిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టనున్నారు. ఎవరికి పదవి ఇవ్వాలనే విషయమై ఏఐసీసీ కార్యకర్తల అభిప్రాయం సేకరించింది. దరఖాస్తులు కూడా స్వీకరించింది. ఏఐసీసీ పరిశీలకు రాలు డాక్టర్ అంజలి నింబాల్కర్ అభిప్రాయ సేకరణ చేసి నివేదికను ఏఐసీసీకి అందజేసింది.
నిబంధనలో సడలింపు?
డిసిసి అధ్యక్ష పదవికి అరత విషయంలో ఏఐసీసీ కొన్ని నిబంధనలు విధించింది. ఆ నిబంధనలకు అనుగుణంగా ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఆ నిబంధనల వల్ల ఆశవహులు ఆశలు వదులుకున్నా రు. ఈ నిబంధనలతో చాలామంది అరత కోల్పోవడంతో సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో ఐదేళ్లు పనిచేయాలని, రెండోసారి అవకాశం లేదని, బంధువులకు పదవులు ఇవ్వద్దని ఏఐసీసీ నిబంధనలు పెట్టింది. ఈ నిబంధనల వల్ల జిల్లాలో అధ్యక్ష పదవి ఆశిస్తున్న హరి వర్ధన్ రెడ్డి, శ్రీశైలం గౌడ్, నక్క ప్రభాకర్, వజ్రేష్ యాదవ్ కు అరత లేకుండా పోయింది. కానీ తాజాగా కొన్ని జిల్లాల్లో నిబంధనలో స్వల్ప మార్పులు చేయడంతో ఈ జిల్లా నేతల్లో ఆశలు చిగురించాయి.
ఓసికా? బీసీ కా?
రాష్ర్టం యూనిట్ గా తీసుకొని బీసీలకు ఎక్కువ పదవులు ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. మేడ్చల్ జిల్లా అధ్యక్ష పదవి ఓసి కు లభిస్తుందా, బీసీలకు లభిస్తుందనేది సస్పెన్స్ గా మారింది. ఓసి నుంచి హరివర్ధన్ రెడ్డి, బీసీ నుంచి నక్క ప్రభాకర్, శ్రీశైలం గౌడ్, వజ్రష్ యాదవ్ ఆశిస్తున్నారు. వీరే కాకుండా ఏఐసీసీ నిబంధనలకు అనుగుణంగా అన్ని అరతలు ఉన్నాయని తుర్కపల్లి వేణుగోపాల్ రెడ్డి గట్టిగా డిసిసి అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. పదవి కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు.