calender_icon.png 31 December, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను శాసనసభలో చర్చించాలి

31-12-2025 12:30:57 AM

సీపీఎం రాష్ట్ర నాయకులు ప్రసాద్ డిమాండ్

నిజామాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలను రాష్ట్రంలో, జరుగుతున్న శాసనసభలో చర్చించి వాటిని ఉపసంహరించుకునే విధంగా ప్రభుత్వం చర్చలు జరపాలని సిపిఎం రాష్ట్ర నాయకులు బుర్రి ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.

ప్రధానంగా విద్యుత్ సవరణ బిల్లు రాష్ట్రాలకు ఉన్న హక్కులను హరించే విధంగా ఉన్నాయని వాటి మూలంగా పేద మధ్యతరగతి ప్రజలతో పాటు రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటారని అదేవిధంగా కార్మిక వ్యతిరేక విధానాలతో తీసుకొచ్చిన నాలుగు లేబర్ చట్టాల మూలంగా కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలు కేవలం పెట్టుబడి దారులకు వారి ప్రయోజనాల కొరకు తీసుకొచ్చినవని ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని మార్చి వి బి జి రాంజీ అనే నూతన సవరణను తీసుకురావడం గ్రామీణ పేదలకు ఉన్న ఉపాధి హామీని హరించటమే అన్నారు. రాష్ట్రాలపై భారాలను మోపే ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే కేరళ తమిళనాడు రాష్ట్రాలలో వాటిని అమలు పరచ కుండా కేంద్రానికి తిప్పి పంపడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాల పైన నిర్ణయాలు తీసుకోవాలని అందుకు ఈ శాసనసభలో చర్చించాలని రాష్ట్రాల హక్కుల ను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ గ్రామస్థాయి వరకు వీటికి ప్రజల్లో కి తీసుకెళ్లి ఎండగడతామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో  సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ. రమేష్ బాబు,  జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, పి వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు  సుజాత, జంగం గంగాధర్, వై గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.