జిల్లా అభివృద్ధికి కేంద్రం సహకరించాలి
డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్
ఆదిలాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని దీనికి కేంద్ర ప్రభుత్వం సహకరించేలా స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే లు కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ అన్నారు. జిల్లాలో యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాల స్థాపన, కుప్టి ప్రాజెక్ట్ పనుల పూర్తి, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు.
మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బజార్హత్నూర్ మండలం పిప్పిరి లో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ అపూర్వ విజయాన్ని సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. సభను విజయవంతం చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, నేతలకు ధన్యవాదాలు తెలిపారు. పిప్పిరి సభ వేదికగా ముఖ్యమంత్రి ఆదిలాబాద్ అభివృద్ధికి అనేక కీలక హామీలు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
జూన్ 2 లోపు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆదిలాబాద్‌ఆర్మూర్ రైల్వే లైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, కేంద్ర నిధుల కో సం స్థానిక బీజేపీ ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో ముం దంజలో నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
ఈ సమావేశంలో టీపీ సీసీ మాజీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజా త, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్, జిల్లా అధికార ప్రతినిధి గోవర్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




