10-02-2026 01:53:17 AM
పుర పోరులో తగ్గేదేలే.. అన్నట్టు మూడు పార్టీల ప్రచారం
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ను ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్ర చారం ముగియగా, బుధవారం పోలింగ్ జరుగనుంది. మూడు పార్టీలు కూడా అత్యధిక మున్సిపల్ స్థానాలను కైవసం చేసు కునేందుకు గట్టిగా ప్రచారం చేశాయి. అధికార కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు చేయడంలో విఫమైందని, తమ నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నదని బీఆర్‌ఎస్ గట్టిగా ప్రచారం చేస్తున్నది.
హిందుత్వ ఎజెండా ను భుజానికెత్తుకుని బీజేపీ ప్రచారం చేసిం ది. కేంద్రం విడుదల చేసే నిధులను రాష్ట్రప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లే దని దుయ్యబట్టింది. వాస్తవానికి రాష్ట్రం లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నిక ల్లో అధికార పార్టీకి మిశ్రమ ఫలితా లు వచ్చాయి. బీఆర్‌ఎస్ ఖాతాలో మెరుగైన స్థానాలు చేరాయి. దీంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
బీఆర్‌ఎస్‌లో ఇప్పుడు సరికొత్త జోష్ కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో పటిష్టంగా ఉండే బీజే పీ సైతం మున్సిపల్ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. కాంగ్రె స్ పార్టీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులందరూ, బీఆర్‌ఎస్ నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, బీజేపీ నుంచి కేంద్ర మంత్రు లు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహా ఎంపీ లు విస్తృతంగా పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో కలవరం
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ను కొంత కలవరపెట్టా యి. ఫలితాలు అంత ఆశాజనకంగా లేవని అధిష్ఠానం భావించినట్లు సొంత పార్టీ వర్గాలే నాడు చెవులు కొరుక్కున్నాయి. గ్రామీణ ఓటర్లు ఇచ్చిన మిశ్రమ తీర్పు, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రతిఫలిస్తుందే మోనన్న భయం ఆ పార్టీ గుటగుటమంటోం ది. ఆరు గ్యారంటీల అమ లుతో రాజకీయ లాభం దక్కు తుందని కాంగ్రెస్ భావించింది. కానీ, అవి పూర్తిగా అమలుకాకపోవడం పార్టీకి పెద్ద మైనస్.
పంచాయతీ ఫలితాలు చూస్తే, హామీల అమలుపై ప్రజల్లో పూర్తి సంతృప్తి లేదన్న అభిప్రాయం బలపడుతోంది. అర్హు ల ఎంపికలో జాప్యం, అమలులో అసమానతలు, గ్రామస్థాయిలో సమాచారంలో పించడం ఇవన్నీ ఓటర్లలో అసంతృప్తిని పెంచిన అంశాలుగా మారాయని పార్టీ అంతర్గత అంచనాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడం, పా ర్టీ సంస్థాగత లోపాలను బహిర్గతం చేసిందన్న విశ్లే షణ వినిపిస్తోంది.
గ్రామ స్థాయి లో స్థానిక నేతల మధ్య సమన్వయలో పం, టికెట్ల పంపిణీలో అసంతృప్తి -వంటివి ఫలితాలపై ప్రభావం చూపినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. గ్రామీణ రాజకీయాల పరిస్థితి పూర్తిగా పట్టణాల్లో ప్రతి బింబించకపోయినా, పంచాయతీ ఫలితాలు ఒక హెచ్చరికగా కాంగ్రెస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పట్టణాల్లో కూడా ఇదే నిర్లక్ష్యం కొనసాగితే, మున్సిపల్ ఎన్నిక ల్లో అనూహ్య ఫలితాలు రావచ్చన్న భ యం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు చిన్న ఎన్నికల ఫలితం మాత్రమే కాదు. ప్రజల్లో ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతను తెలియజేసే హెచ్చరికగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్‌ఎస్‌లో పంచాయతీ ఫలితాల జోష్
పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షపార్టీ బీఆర్‌ఎస్ గౌరవప్రదమైన సీట్లు సాధించింది. ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొ త్త ఉత్సాహాన్ని నింపాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత నిరుత్సాహంలో ఉన్న కేడర్‌కు జోష్‌నిచ్చింది. మొత్తానికి పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్‌కు ప్ర జాబలం ఉందని తేల్చాయి. ఇదే ఒరవడిలో మున్సిపల్ ఎన్నికలకూ గులాబీ శ్రేణులు రంగంలోకి దిగాయి. పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు స్వయంగా పా ర్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు రంగంలోకి దిగి ప్రచారం చేశారు.
క్యాడర్‌ను మళ్లీ చైతన్యపరిచారు. పంచాయతీ ఫలితాలను ఉదాహరణగా చూపుతూ, ‘ప్రజలు మార్పు పై పునఃపరిశీలన మొదలుపెట్టారు’ అన్న సందేశాన్ని బలంగా ప్రచారం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన ఊపును పట్టణాలకు విస్తరించడమే బీఆర్‌ఎస్ ముందు న్న ప్రధాన వ్యూహంగా మారింది. పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల అనుభవాన్ని ఆయు ధంగా చేసుకుని, కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడిచేయాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘హామీల హడావుడి తప్ప పాలనలో స్పష్టత లేదు’ అన్నదే బీఆర్‌ఎస్ ప్రధాన ఆరోపణగా మారింది.
మున్సిపాలిటీలకు నిధుల కొరత, అభివృద్ధి పనుల జాప్యం, పట్టణ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఇవన్నీ ప్రచార అస్త్రాలుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కనిపించిన మౌనం, ఇప్పు డు బీఆర్‌ఎస్ కేడర్‌లో కనిపించడం లేదు. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు సమావేశాలు, వ్యూహ చర్చలు పెరగడం పార్టీ శ్రేణుల్లో జోష్‌ను సూచిస్తోంది. పంచాయతీ ఎన్నికలతో వచ్చిన కొత్త జోష్‌ను గెలుపుగా మార్చగలిగితేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి పటిష్టంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
రెండు ప్రభుత్వాల వైఫల్యాలే బీజేపీ అస్త్రాలు
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా, ప్రజల స్థితిగతులు మారడం లేదని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై బీజేపీ విమర్శలు చేస్తున్నది. ఆ రెండు పార్టీలు ఒకే గూటి పక్షులని ఘాటు ఆరోపణలు చేస్తోంది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలన ఒకే విధంగా తలపిస్తోందని ఆరోపిస్తోంది. బల్దియాల్లో కాంట్రాక్టులు, బిల్లుల చెల్లింపులు, అధికారుల నియామకాల్లో రాజకీయ జోక్యం యథావిధిగా సాగుతోందని విమర్శలు చేస్తోంది.
బీఆర్‌ఎస్ పాలనలో బల్దియాలను అప్పుల కుప్పలుగా మార్చిందని, తద్వారా బల్దియాలను ఆర్థికంగా బలహీనపరిచిందని అంటోంది. అలాగే ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్‌పైనా విమర్శనస్త్రాలు సంధిస్తోంది. ఎన్నికల ముందు పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు గంగపాలయ్యాయని భగ్గుమంటోంది. మున్సిపల్ పాలనలోనూ విఫలమైందని విమర్శిసోతది. పట్టణ ప్రజనలకు మౌలిక వసతులు కల్పించడం లేదంటోంది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ విభేదాలున్నట్లు కనిపించినా, పాలన విషయంలో ఇద్దరూ ఒకటేనన్నదే బీజేపీ ప్రచార నినాదంగా మారింది. రెండు పార్టీల పరస్పర ఆరోపణలు చేసుకుంటూ, డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడుతున్నాయి. పట్టణాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్రప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపిస్తోంది.
కేంద్రం విడుదల చేసే నిధులను సద్వినియోగం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, అదే విధానాన్ని గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వమూ అనుసరించిందని గుర్తుచేస్తోంది. ఇలా రెండు పార్టీలను విమర్శించి బీజేపీ పట్టణాల్లో మధ్యతరగతి, యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
అర్బన్ సమస్యలపై పట్టణవాసుల ప్రశ్నలు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార వేగం పెంచినంతగా, పట్టణ పాలనపై పట్టు పెంచలేకపోతుందన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. నిధుల కొరత ఉందని చెప్తున్నప్పటికీ, అవేమీ మున్సిపల్ ఓటర్లు ఉపేక్షించడం లేదనే అధికారపార్టీ వర్గాలే భావిస్తున్నాయి. నిధులు ఆలస్యం కారణంగానే అభివృద్ధి పనులు నిలిచిపోయాయన్న ఆరోపణలు ఉన్నాయి.
రాజకీయ ఒత్తిళ్లతో అధికారుల బదిలీలు, కాంట్రాక్టుల కేటాయింపులు జరుగుతున్నాయన్న విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ప్రచార సభల్లో సీఎం పాల్గొనడం, హామీల వర్షం కురిపిస్తున్నా.. పట్టణ ప్రజల సమస్యలపై సమీక్షలు ఏవీ.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ, కాంగ్రెస్ ఆత్మవిమర్శగా తీసుకున్నట్లు కనిపించడం లేదు.