26-10-2025 12:40:15 AM
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే, ఈసారి డీసీసీ అధ్యక్షుల ఎంపికకు కాంగ్రెస్ అధిష్ఠానవర్గం నూతన విధానాన్ని అనుసరిస్తున్నది. పార్టీలో క్రమశిక్షణ, పార్టీ సిద్ధాంతాలతో కట్టుబడి, పార్టీకి విధేయులుగా ఉండేవారిని డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని తలపెట్టింది.
అందు కే వివిధ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నాయకులను పార్టీ అధిష్ఠానం తెలంగాణలోని అన్ని జిల్లాలకు పరిశీలకులుగా పంపిం చిం ది. క్షేత్రస్థాయిలో వారు పార్టీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను సేకరించి కేంద్ర పార్టీ ముఖ్యుడు, ఎంపీ కేసీ వేణుగోపాల్‌కు నివేదికలు అందజేశారు. అయితే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు, మంత్రు లు, ఎమ్మెల్యేల ప్రమేయంతో డీసీసీ అధ్యక్షుల నియామకం జరగడం గతంలో ఆనవాయితీగా ఉండేది.
కానీ, ఇప్పుడు పార్టీ పరిశీ లకుల ద్వారా.. నమ్మకం, పార్టీ పట్ల విధేయత కలిగివున్నవారినే డీసీసీ అధ్యక్షులుగా ఎంపిక చేయాలని అధిష్ఠానవర్గం కృతఃనిశ్చయంతో ఉన్నది. అందుకే, డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించి పెద్ద కసరత్తునే నెత్తికెత్తుకుంది. రాష్ట్ర పార్టీ నాయకత్వం, మంత్రుల ఇష్టాయిష్టాల మేర పార్టీ జిల్లా అధ్యక్షులను ఎంపిక చేస్తే భవిష్యత్తులో రాజకీయాలు ఎక్కువై పార్టీకి విధేయత సన్నగిల్లే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం భావించింది.
మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జిల్లాల్లో, తమ విధేయులను డీసీసీ అధ్యక్షులుగా నియమించు నేటట్టు సిఫారసులు చేసే అవకాశానికి దీనితో అడ్డుకట్ట పడింది. పార్టీలో అంతర్గత రాజకీయాలకు చోటులేకుండా.. నమ్మకం, విధేయత పరమావధిగా భవిష్యత్తులో పార్టీ పటిష్టంగా ఉండాలనే ఆలోచన అధిష్ఠానవర్గం చేపట్టిన ఈ కసరత్తులో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.
డీసీసీ అధ్యక్షుల ఎంపికకు సంబంధించి కేసీ వేణుగోపాల్ శనివారం ఢిల్లీలో పార్టీ పరిశీలకుల నివేదికలను, అభిప్రాయాలను సేక రించటంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అభిప్రాయాలను విడివిడిగా తెలు సుకున్నారు. వారితో ఆయన ప్రత్యేకంగా సమావేశమైనప్పటికీ విడివిడిగానే వారి అభిప్రాయాలను తెలుసుకోవడం గమనార్హం.
రాష్ట్రంలో పార్టీ పటిష్టానికి దీర్ఘకాలిక వ్యూహంతో అధిష్ఠానం ముందుకు కదులుతున్నదనేందుకు ఇది తార్కాణం. క్షేత్రస్థాయి లో పార్టీకి విధేయులై వెనుదన్నుగా ఉండాలని.. వారికే భవిష్యత్తులో ప్రాధాన్యత లభించాలని అధిష్ఠానవర్గం భావిస్తున్నది. కొత్త తరహాలో డీసీసీ అధ్యక్షుల నియామకానికి అధిష్ఠానవర్గం పూనుకోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.