23-10-2025 12:00:00 AM
- విజయ క్రాంతి కథనానికి స్పందన
- ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని కలసిన స్థానిక నేతలు, కాలనీవాసులు
అబ్దుల్లాపూర్ మెట్, అక్టోబర్ 22: పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ లో రూ. 5 కోట్ల పార్కు స్థలం కబ్జాపై బుధవారం విజయ క్రాంతిలో ప్రచురితమైన కథనం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో జన చైతన్య హౌసింగ్ కార్పొరేషన్ లే అవుట్ లోని ఓపెన్ స్థలం, పార్కు స్థలం, కబ్జాపై విశ్లేషణాత్మకంగా కథనం రావడంతో కబ్జాదారుల్లో కొంత ఆల్జడి జరిగింది. ఈ కథనం ఆధారంగా స్థానిక నాయకులు, కాలనీవాసులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ని వ్యక్తిగతంగా కలిసి సమస్యను విన్నవించారు.
పార్కు స్థలం కబ్జా విజయ క్రాంతి దినపత్రికలో వచ్చిన కథనం వాస్తవమేనని ఎమ్మెల్యేకు స్థానికులు వివరించారు. దీంతో ఎమ్మెల్యే పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీందర్ రెడ్డి, సబ్ రిజిస్టర్ రవీందర్ లకు ఫోన్ చేసి పార్కు స్థలం కబ్జాపై ఆరాదీసి, అధికారుల ఉదాసీన వ్యహారం పై కొంత సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఓపెన్ స్థలాలు, పార్కు స్థలాలపై ఆరా తీసినట్లు తెలుస్తుంది.
మండల పరిధిలో పార్కు స్థలాలు, ప్రభుత్వ భూముల చెరబట్టిన కబ్జారాయులపై వస్తున్న కథనాల పై స్థానిక ప్రజలుసైతం హర్షం వ్యక్తం చేశారు. గతంలో సుర్మాయి గూడ లో గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ స్థలం కబ్జాపై వచ్చిన కథనాలతో స్థానికులు ఎమ్మెల్యేను కలవగా... రెవెన్యూ అధికారులతో ఆరా తీసి.. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆ స్థలములో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.