12-01-2026 03:03:46 AM
కాంగ్రెస్ పార్టీలో ఒకరికే రెండు పదవులివ్వడంపై గుర్రుముంటున్న పార్టీ శ్రేణులు
హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి) : అధికార కాంగ్రెస్ పార్టీకి జోడీ పదవుల గండం వెంటాడుతోంది. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడిన క్యాడర్‌కు గుర్తింపు దక్కడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఒక్కో నేతకు రెండు పదవులు కట్టపెట్డడంపైనా.. మిగతా నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్ఠానం మాత్రం జోడు పదవులు ఇవ్వొద్దని, ఒకరికి ఒకే పదవి, ఒక కుటుంబానికి ఒకరికే పదవీ ఇవ్వాలనే నిబంధన పెట్టింది. కానీ తెలంగాణలో మాత్రం పార్టీ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి, భంగపడిన చాలా మంది నాయకులు.. అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవు లు లేదంటే పార్టీ పదవులైనా దక్కుతాయనుకున్న వారికి నేడు మొండిచెయ్యే చూపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాటి నుంచి వందలాది మంది నాయకులు నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పదవుల కోసం రెండేళ్లుగా ఆశావహులు వెయ్యి కళ్ల తో నిరీక్షిస్తున్నారు. అయితే ఇటీవల ప్రకటించిన జిల్లా కాంగ్రెస్ (డీసీసీ) కమిటీ అధ్యక్షుల్లోనూ ఐదుగురు ఎమ్మెల్యేలను నియమించారు. వీరిలో యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడిగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, నిర్మల్-ఆదిలాబాద్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, నాగర్ కర్నూల్- అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, కరీంనగర్-చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంగనర్- రామగుండం ఎమ్మె ల్యే రాజ్‌ఠాకూర్‌ను నియమించారు. ఇక శాప్ చైర్మన్ శివసేనారెడ్డిని వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించిన విష యం తెలిసిందే. అంతే కాకుండా పీసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడిగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, పీసీసీ ఆదివాసీ సెల్ అధ్యక్షుడిగా నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌కు బాధ్యతలు అప్పగించారు.
అయితే ఎమ్మెల్యేలను డీసీసీ అధ్యక్షులుగా నియమించిన ఐదు జిల్లాలతో పాటు పార్టీ అనుబంధ సంఘాలైన పీసీసీ ఎస్సీ విభాగం, ఆదివాసీ విభాగం పదవుల కోసం చాలా మంది సీనియర్లు, నాయకులు ఆశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చే విషయంలో అన్యాయం జరిగిందని, ఇప్పుడు పార్టీ పదవుల్లోనూ తమను గుర్తించడం లేదని కొందరు సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక యాదాద్రి భువనగిరి జిల్లానే చూసుకుంటే డీసీసీ పదవి కోసం బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు పోత్నక్ ప్రమోద్‌కుమార్, తంగళ్లపల్లి రవికుమార్ పోటీ పడ్డారు. ఆ ఇద్దరు నేతలు మూడు దశాబ్దాలుకు పైగా ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌తో పాటు పార్టీలో కీలకంగానే పని చేస్తున్నారు.
ఈ ఇద్దరిలో ఒకరికి డీసీసీ అధ్యక్ష పదవి అప్పగిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సమస్య ఒక యాదాద్రి భువనగికి కాదని, మిగతా జిల్లాలలోనూ ఉందని పార్టీ నేతలే చెబుతున్నారు. పీసీసీ ఎస్సీ విభాగం కోసం పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులు జల్‌పల్లి నరేందర్, అచ్యుత రమేష్, పత్తి కుమార్ తదితరులు పోటీ పడ్డారు. వీరిని కాదని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కు అప్పగించారు. ఇదే ఎస్టీ విభాగం అధ్యక్షపదవి కోసం లింగంనాయక్, నరేష్‌జాదవ్, వెంకన్న తదితరులు ఆశించి నా.. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌కు ఇవ్వడంపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఓబీసీ, మహిళా విభాగం పదవులు కూడా ఎమ్మెల్యేలకే..?
ఇదిలా ఉండగా, త్వరలోనే మరికొన్ని పార్టీ పదవుల నియామకం జరుగుతుందని చెబుతున్నారు. అందులో పీసీసీ ఓబీసీ విభాగం, మహిళా కాంగ్రెస్ పదవులకు ఎమ్మెల్యేలను నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. పీసీసీ ఓబీసీ పదవీ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మహిళా విభాగం అధ్యక్షురాలుగా నారాయణపేట్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఓబీసీ పదవి కోసం పార్టీ సీనియర్ నాయకులు కేతూరి వెంకటేష్‌తో పాటు మరికొందరు ఆశిస్తున్నారు. ఇక మహిళా విభాగం అధ్యక్ష పదవి కోసం ఇందిరాశోభన్, సరితా తిరుపతయ్యయాదవ్ పోటీ పడుతున్నారు. మొదటి నుంచి సరితాతిరుపతయ్య యాదవ్ పేరు వినిపిస్తోంది.
అనుహ్యంగా ఎమ్మెల్యే పర్ణికారెడ్డి పేరు తెరపైకి రావడంతో పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్నవారికే పార్టీ పదవులు అప్పగిస్తే భవిష్యత్‌లో పార్టీ కార్యక్రమాలు కుంటుపడే ప్రమాదం ఉందనే హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యేగా తన సొంత నియోజక వర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ శ్రేణులకు సమయం ఇవ్వాల్సి ఉంటుందని, ఇక డీసీసీ అధ్యక్షులుగా జిల్లాలలో, పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుందని వాద న వినిపిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుందని, ఇంకో ఏడాదయితే ఎన్నికల మూడ్‌లోకి వస్తుందని, ఇలాంటి సమయంలో పదవులను ఉన్నవారికే మళ్లీ పదవులు ఇవ్వడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.