12-01-2026 02:47:49 AM
హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): 2013 నుంచి నరేగా (మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం)కు రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తే, 2014 నుంచి ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. అవినీతిని నిరోధించేందుకు వీబీజీరామ్‌జీ చట్టం తీసుకొచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ చట్టంపై వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ...భారతదేశంలో ఉపాధి హామీ పథకాలు 1960 నుంచే అమలులో ఉన్నప్పటికీ, దశాబ్దాలుగా వచ్చిన ప్రతి పథకమూ నిర్మాణాత్మక లోపాలు, లీకేజీలు, అవినీతితో బారిన పడి పేద ప్రజలకు అన్యాయం జరిగిందని అన్నారు.
ఈ లోపాలను సరిదిద్దేందుకే పారదర్శకత, జవాబుదారీతనం కలిగిన ఆధునిక సాంకేతికతతో వీబీజీరామ్‌జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్‌గా మారే దిశగా దృఢంగా ముందుకెళ్తోందని పేర్కొన్నారు. ఒకప్పుడు 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ నేడు అతిపెద్ద 4వ స్థానానికి చేరుకుందని, త్వరలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని తెలిపారు. ఈ మారుతున్న ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా పాత సంక్షేమ మోడళ్లలో మార్పులు అవసరమని, అందుకే వీబీజీరామ్‌జీ అనివార్యమని స్పష్టం చేశారు.
మహాత్మా గాంధీ పేరుపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న మక్కువపై ఆయన ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ లేదా ఇందిరా గాంధీ పేర్లకు బదులుగా హైదరాబాద్ విమానాశ్రయానికి మహాత్మా గాంధీ పేరు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. భారత దేశంలో ఉపాధి పథకాలు ఎంజీఎన్‌ఆర్‌ఈజీకు ముందే అమలులో ఉన్నాయని గుర్తు చేశారు. 1989లో జవహర్ రోజ్ గార్ యోజన నుంచి ప్రారంభమైన ఉపాధి పథకాలు అనేక మార్పులు చెంది, 2005లో ఎన్‌ఆర్‌ఈజీఏ (నరేగా)గా మారాయని, ఆ సమయంలో మహాత్మా గాంధీ పేరు పెట్టాలనే ఆలోచన కాంగ్రెస్‌కు ఎప్పుడూ రాలేదని విమర్శించారు. 2021 మార్చి 16న బ్రౌన్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కాంగ్రెస్ మోడల్ “రన్ అవుట్ ఆఫ్ స్టీమ్ అయిపోయింది” అని, 1990 విజన్‌ను 2004లో ప్యాకేజింగ్ చేయడం ఇక పనిచేయడం లేదని స్వ యంగా అంగీకరించారని గుర్తుచేశారు.
ఈ చట్టంతో రాష్ట్రాల బాధ్యత పెరుగుతుంది
నరేగా కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు 100 శాతం అన్‌స్కిల్డ్ వేతనాలను భరించడం వల్ల, రాష్ట్రాలు ఆర్థిక బాధ్యత లేకుండా వ్యవహరించాయని, వేతనాల కృత్రిమ పెంపు, భారీ లీకేజీలు చోటుచేసుకున్నాయని అన్నారు. దానికి భిన్నంగా వీబీజీరామ్‌జీ చట్టం 60:40 నిధుల భాగస్వామ్య మోడల్‌ను ప్రవేశపెడుతుందని, దీని ద్వారా రాష్ట్రాల బాధ్యత, ఆర్థిక క్రమశిక్షణ, జవాబుదారీతనం పెరుగుతాయని తెలిపారు. యూపీఏ పాలన కాలంలో నరేగా కింద జరిగిన కుంభకోణాలపై డాక్యుమెంటెడ్ ఉదాహరణలను కూడా ఆయన ప్రస్తావించారు.
ఉత్తరప్రదేశ్‌లో (2011) నకిలీ జాబ్ కార్డులు, కల్పిత పనులు, లేనిపోని వ్యక్తులకు చెల్లింపుల ద్వారా రూ.10,000 కోట్లకు పైగా దుర్వినియోగం జరిగిందని చెప్పారు. అలాగే ఒడిశా సంబల్పూర్ జిల్లాలో (2012) మరణించినవారికి, పని చేయలేని వారికి, పెన్షనర్లకు వేతనాలు చూపించడం, నకిలీ పనిదినాలు, డూప్లికేట్ బిల్లులు వంటి అవకతవకలు జరిగాయని వివరించారు. ఈ చట్టం ముఖ్య ఉద్దేశాలు.. ఉపాధి హామీ రోజులను 100 నుంచి 125 రోజులకు పెంపు, కనీసం 50 శాతం పనులు గ్రామ పంచాయతీల ద్వారా అమలు, గ్రామసభలు, గ్రామ పంచాయతీలు గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం వంటి అంశాలున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి ఓం ప్రకాష్ ధన్ కర్, పార్టీ రాష్ర్ట ప్రధానకార్యదర్శి డా.ఎన్.గౌతమ్‌రావు, రాష్ర్ట సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, కిసాన్ మోర్చా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య, బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు డా.బూర నర్సయ్యగౌడ్, సీనియర్ నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, పాపయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.