calender_icon.png 23 October, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి ఆమడదూరం

23-10-2025 12:00:00 AM

-అన్ని రకాలుగా వెనుకబడిన ఎర్రుపాలెం మండలం

-మాటలకే పరిమితమైన నేతల హామీలు

-వెక్కిరిస్తున్న పాలకుల వేసిన శిలాఫలకాలు

ఎర్రుపాలెం అక్టోబర్ 21 ( విజయక్రాం తి): తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఎరుపాలెం మండలానికి చాలా చారిత్రక నేపథ్యముంది. నిజాం పరిపాలనలో రజాకారుల అరాచకాలకు ఎదురొడ్డి నిలిచారు ఈ మండల ప్రజలు. నాటి దక్కన్ సర్దారుగా పేరుందిన సర్దార్ జమలాపురం కేశవరావు ఈ మండల వాసే. మధిర నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎన్నికైన బోడేపూడి వెంకటేశ్వరరావు, కట్టా వెంకట నరసయ్య మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు . తెలంగాణ ప్రాంతం నుండి మొదటి మంత్రిగా పనిచేసిన శీలం సిద్ధారెడ్డి బనిగండ్లపాడు గ్రామ వాసే. మంత్రిగా తన గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను, ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించారు. మండలాన్ని అభివృద్ధి పరిచారు. పేరుగాంచిన జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ మండలంలోనిదే. ఎర్రుపాలెం మండలం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కు సరిహద్దు మండలం గా ఉన్నది. అయితే ఇంతటి పేరుగాంచిన ఎరుపాలెం మండలం దశాబ్ద కాలంగా అభివృద్ధికి ఆమడ దూరం లో ఉంది. దశాబ్ద కాలంగ నేటి పాలకు లు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇచ్చిన మాటలు,వాగ్దానాలు అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితం అయ్యాయి. మండలం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఆగిపోయింది.

సమస్యల నిలయం..

మండలంలో జమలాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఈ గుడికి సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో భక్తుల రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పాలవుతున్నారు. ఇక ఇదే గ్రామంలోని చెరువును రిజర్వాయర్ గా మారుస్తామని, పర్యాటకంగానూ అభివృద్ధి పరుస్తామని నేతలు హామీలు ఇచ్చారు. ఆ తర్వాత దాని గురించి పట్టించుకునే నాధుడు కరువయ్యారు. ఇక మండలంలోని ప్రతి గ్రామంలో క్రీడా పార్కులు కట్టిస్తామని, మండలాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని బాకాలు ఊదారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి కట్టిస్తామని సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని ఇలా ఒకటేమిటి.. లెక్కకు మించిన హామీలను ప్రజలకు చెప్పి ఆశలు కల్పించారు. వారు చెప్పిన మాటలు విన్న ప్రజలు తమ మండలానికి, తమకి మంచి రోజులు రాబోతున్నాయని, ఇక అంతా మంచే జరుగుతుందని భావించారు. కానీ వారి ఆశలు అడియాసలు కావడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. నేతల మాటలు ప్రారంభోత్సవాలకే పరిమితమై, అప్పుడు వేసిన శిలాఫలకాలు దిష్టి బొమ్మల్లా వెక్కిరిస్తున్నాయి. ఇప్పటికైనా నాయకులు కళ్ళు తెరిచి, వారు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే బాగుంటుందని మండల ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారు. 

భక్తులకు ఇక్కట్లు..

ఇది మండలం ఇది మండలంలోని జమలాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం. చిన్న తిరుపతి అంటూ తెలంగాణ వాసులు ఈ దేవస్థానాన్ని పిలుచుకుంటారు. ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తుంటారు. అయితే ఇక్కడికి సరైన బస్సు సౌకర్యం లేదు. గతంలో మధిర నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉండేది ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బస్సులు నడవడం లేదు. దీంతో తెలంగాణ వాసులు బస్సు మార్గాన దేవస్థానానికి రావాలంటే ఇక్కట్లు తప్పడం లేదు. ఇక ఇదే సమయంలో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మాత్రం విజయవాడ నుంచి ఈ దేవస్థానానికి బస్సులు నడుపుతోంది. పక్క రాష్ట్రం బస్సులు నడుపుతున్నా, మన రాష్ట్ర అధికార యంత్రాంగానికి ఇక్కడ బస్సు నడపాలని సోయి కలవడం లేదు. ఇకనైనా పాలకులు పూనుకొని దేవస్థానానికి బస్సు నడిపిస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. 

చెరువును రిజర్వాయర్‌గా  మార్చేదెన్నడో..

ఈ కనిపించే చెరువు జమలాపురం పెద్ద చెరువుగా పిలుచుకుంటారు. ఈ చెరువును రిజర్వాయర్ గా మార్చి రెండు పంటలు పండే విధంగా ఆధునికీకరిస్తామని చెప్పారు అదే సమయంలో ఇక్కడ బోట్ షికారు ఏర్పాటు చేసి ప్రకృతి రమణీయతకు తగ్గట్టుగా కాటేజీలను హోటలను ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పారు. కొంత అభివృద్ధి పనులు కూడా మొదలుపెట్టారు. ఆ తర్వాత అభివృద్ధి పనులు పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ప్రస్తుతం ఈ అసంపూర్ణ నిర్మాణాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారిపోయాయి. పాలకులు అధికారులు వీటిపై దృష్టి సారించి ఆకతాయిలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, సగంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. 

పరిశ్రమల మాట వట్టిదేనా..?

ఇక్కడ కనిపిస్తున్న రేమిడిచర్ల, రామాపురం, కొత్తపాలెం గ్రామాల మధ్యలో ఉన్న ప్రభుత్వ భూమి. ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరిచి పరిశ్రమలు తీసుకువస్తామని, దీనివల్ల మండల ప్రజలకు మండలంలోని యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా లభిస్తాయని నేతలు చెప్పారు. వారి మాట ఒక్క అడుగు ముందుకు సాగకపోవడంతో మండలంలోని చదువుకున్న యువత తమకు ఆశలు కల్పించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వైద్య సాయానికి పక్క ఊర్లకు   వెళ్లాల్సిందేనా..!

మండలం ప్రజలకు అత్యవసర వైద్య సాయం కోసం ఇప్పటికీ అయితే అటు విజయవాడ లేకపోతే ఇటు ఖమ్మం వరకు వెళ్లాల్సిందే! ఈ అవసరం లేకుండా మండల కేంద్రంలోనే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తామంటూ నాయకులు హామీ ఇచ్చారు. ఇదిగో ఆసుపత్రి ప్రారంభిస్తున్నామంటూ శిలాఫలకాన్ని కూడా వేశారు. ఈ శిలాఫలకం రాయిగా మారి, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ హామీని వెక్కిరింతగా చూపిస్తోంది. ప్రజలకు అందే వైద్య సాయంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, వెంటనే ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక అలాగే మధిర విజయవాడ ప్రధాన రహదారికి మధ్యలో రేమిడిచర్ల క్రాస్ నుండి ఎర్రుపాలెం ఆర్‌ఓబి వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని నేతలు శిలాఫలకాలు వేశారు. దీని గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఇలా నేతలు ఇచ్చిన హామీలు పట్టించుకోకపోవడంతో మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మండలాన్ని అన్ని విధాలుగా  అభివృద్ధి చేయాలి

ఎర్రుపాలెం మండలం అన్ని విధాలుగా వెనుకబడిపోయింది. అభివృద్ధికి నోచుకోవడం లేదు. గత పాలకులు, ప్రస్తుత అధికార పార్టీ మండలాన్ని అభివృద్ధి చేస్తామని చాలా హామీలు ఇచ్చారు. అవేవీ నెరవేర లేదు. ప్రభుత్వ ఆసుపత్రి లేదు.జమలాపురం వెంకటేశ్వర స్వామికి బస్సు సౌకర్యం లేదు. పెద్ద చెరువుగా మారుస్తామన్న హామీకి దిక్కేలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే నేతల హామీలు చాంతాడంత. వీటన్నింటి పైన అధికార పార్టీ దృష్టి సారించి అభివృద్ధి చేయాలి. మండల ప్రజలు ఇక్కట్లు తొలగించాలి. 

- చిన్నం శ్రీను, ఎర్రుపాలెం 

ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

మండలాన్ని అభివృద్ధి పరుస్తామని గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం లోని నాయకులు పలు శిలాఫలకాలు ప్రారంభించారు. ప్రస్తుతం వాటిని పట్టించుకునే నాధుడు లేడు. దీంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేసిన అభివృద్ధి శిలాఫలకాల కు ప్రభుత్వం నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించి ఉపయోగంలోనికి తీసుకురావాలి. అపుడే మండల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.

- ప్రభాకర్ రావు, సీపీఎం, మండల కార్యదర్శి, ఎర్రుపాలెం.