19 March, 2026 | 5:50 AM

జిల్లాను గంజాయి రహితంగా మార్చాలి

19-03-2026 12:00 AM

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్న కలెక్టర్, ఎస్పీ పిలుపు

ఆదిలాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): జిల్లాను గంజాయి రహిత జిల్లాగా  తీర్చిదిద్దడానికి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రం లోని టీఎన్జీవోస్ సంఘ భవనం లో మాదక ద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, మహిళల భద్రత, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై పోలీ సు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇటీవల గెలిచిన సర్పంచులు, కౌన్సిలర్ లకు అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పోలీస్, రవాణా, వైద్య, ఇతర శాఖల అధికారులు మాదక ద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, సీసీ కెమెరాల ప్రాము ఖ్యతపై వారికి అవగాహన కల్పించారు. అదేవిదంగా అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో నేరాల నియంత్రణకు, శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ’మూడవ కన్ను’లా పనిచేస్తాయని, ప్రతి ఒక్కరూ వీటి ఏర్పాటుపై అవగాహన పెంచుకోవాలని సూచిం చారు.

సర్పంచులు, కౌన్సిలర్లు తమ పరిధిలోని గ్రామాలను, వార్డులను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గంజాయి సాగు చేసే రైతులపై కఠిన చర్యలు ఉంటాయని, ఇప్పటికే కొంతమంది రైతుల వివరాలను అగ్రికల్చర్ కమిషనర్కు పంపి వారి రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలను నిలిపివేసినట్లు వెల్లడించారు. గ్రా మాల్లో బెల్ట్ షాపులు, అక్రమ మద్యం విక్రయాల పై తీర్మానం చేయాలని కోరారు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ’అరైవ్ అలైవ్’ నినాదంతో రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని కోరారు. గంజాయి సాగు, విక్రయాలు లేదా వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్గా మార్చడంలో భాగం గా పోలీస్ శాఖలో ప్రత్యేకంగా ’ఈగల్ ఫోర్స్’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంజాయి సాగు చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ అవగాహన కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ ఎస్పీ సీతారాం, అదనపు ఎస్పీ కృష్ణ మూర్తి, సిఐ ప్రకాష్ రెడ్డి, జిల్లా అదనపు ఎస్పీలు సురేందర్ రావు, మౌనిక, ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ  జీవన్ రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వరరావు, విజేందర్, పొగాకు నియంత్రణ అధికారి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.