13 March, 2026 | 3:35 PM

సమన్వయంతో జిల్లాను అగ్రగామిగా నిలపాలి

13-03-2026 12:00 AM
  1. ప్రజా ప్రతినిధులకు కలెక్టర్ రాజర్షి షా పిలుపు

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం

ఆదిలాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు 99 రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లాలో చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక కార్యాచరణ విజయవంతంలో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు.

గురువారం స్థానిక రెవెన్యూ గార్డెన్ లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల శిక్షణ కార్యక్రమాన్ని ఆదిలాబాదు, బోథ్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా జిల్లాలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ధికారులు తమ ప్రగతి నివేదికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

అనంతరం రైతులకు ఉచితంగా అందించే రూ. 500 ల విలువగల ఐదు రకాల కూరగాయల విత్తనాల కిట్ ను కలెక్టర్, ఎమ్మెల్యే లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ... జిల్లాలో ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక‘ లో భాగంగా 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని, ఈ ప్రత్యేక కార్యక్రమం మార్చి 6న ప్రారంభమై జూన్ 12 వరకు కొనసాగుతుందని అన్నారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, గ్రామ, వార్డు స్థాయిలో పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఏప్రిల్ 2వ తేదీన అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, వార్డుల్లో వార్డు సభలు నిర్వహించి, అభివృద్ధి పనులపై సమీక్ష జరపాలని ఆదేశించారు. సర్పంచులు, కౌన్సిలర్లు సమన్వయంతో పని చేసి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, డిఆర్డీఓ రవీందర్, డిపిఓ రమేష్, అదనపు ఎస్పీలు సురేందర్ రావు, మౌనిక, మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, జిల్లా ఉద్యానవన అధికారి నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ రాజు, సర్పంచ్ లు, మున్సిపల్ వార్డుల కౌన్సిలర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.