03-11-2025 01:05:56 AM
‘లోన నీలమేఘ శ్యాముడుండగా లేని ఆకాశం నీలం మనకెందుకు చింతలు, చితిమంటలు లేవికపై
నవ్వుతూ నవ్విద్దాం విశ్వవేదికపై’ అంటూ తన కవిత్వాన్ని ప్రపంచ వ్యాప్తం విస్తృత పరుస్తారు కవి శ్రీరామ్.‘శరీర మాలిన్యాన్ని దూరం చేసేది నీరు మనసు మాలిన్యాన్ని కడిగివేసేది కన్నీరు’ అంటూ ప్రబోధిస్తారు. ఆయన అత్యున్నత కార్యనిర్వహణ అధికారులకు శ్రీరామ్ సార్. ఆయన ఆధ్యాత్మిక ఉపన్యాసాలు విన్న సామాన్యులకు భగవాన్ శ్రీరామ్. ఇంకొందరికి.. జీవితంలోని నిమ్నోన్నతాల ఎత్తుపల్లాల పార్శాలను తనదైన కోణంలో స్పష్టమైన శైలితో, దృక్పథంతో. కార్యాకారణ పూర్వకంగా నిర్వచించే తాత్విక ఆధ్యాత్మిక బోధకుడు.
అన్వేషకుడు. నిరంతర శోధకుడు. ఆరాధకుడు. ఆయన ఆముష్కికుడిగా దేశ విదేశాల్లో ప్రభావశీలురుగా కొనసాగుతుంటారు. ఒక సామాన్య వ్యక్తి లో ఇన్ని అసామాన్య అసాధారణ కోణాలు ప్రతిబింబించడం ఆశ్చర్యానికి లోను చేస్తుంది. నాకు మాత్రం ఆయనలో లోపల దాగిన ఒక గొప్ప భారతీయ తాత్విక కవి భావకుడు దృగ్గోచరమవుతాడు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించిన ఆయన కవితా సంపుటి ‘హసిత బాష్పాలు’. కవితలు చదువుతుంటే నాలో నాకు తెలియకుండానే కంప ప్రకంపనలు ఏర్పడినవి. మొత్తానికి మొత్తంగా నన్ను ఒక అవ్యక్త జ్వరపీడుతున్ని, భూకంప బాధితుడిని చేసింది.
మనిషి తాలూకు సకల వైక్లభ్యాలకు కారణభూతమైన విషయీ విషయాలను, సమస్యలను, సంక్షోభాలను, సంక్లిష్టతలను సంఘర్షణలను కదళీపాకంలా ఆధ్యాత్మికతను జోడిస్తూ రచన సాగింది. తన అద్భుతమైన అర్థవంతమైన భావనా వైశిష్ట్య నైపుణ్యాల సమాహార కవితా పటిమతో 18 ఖండికలుగా ఈ గ్రంథాన్ని రచించారు. తద్వారా పాఠకుడి అంతః రుచితసీమలను ధగధగాయమానపరిచిన ‘హసితభాష్పాలు’గా గ్రంథస్తమైంది. ఈ పొత్తాన్ని కళ్లు మిరుమిట్లుగొల్పే గ్లేజ్డ్ పేపర్‌పెన అర్థవంతమైన బొమ్మలతో అత్యంత సుందరంగా ‘వాక్కులమ్మ’ ప్రచురణగా తీసుకువచ్చారు.
నాలుగు మెట్లపై కవిత్వం, కావ్యస్థాయి
‘హసితబాష్పాలు’ చదివిన తర్వాత నాకు ప్రపంచ సాహిత్యకారుడి మాటలు గుర్తుకువస్తున్నాయి. ‘సాహిత్యం.. మానవ ఆత్మకు అత్యంత కచ్చితమైన ప్రతిబింబం. రచయిత ప్రవక్తలా మాత్రమే కాకుండా జీవన నిర్మాణకర్తగా వ్యవహరించాలి. సాహిత్యం ఉద్దేశం మనిషిని తనను తాను, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునేలా చేయడమే’ అని వివరించాడు. 2010 ఆగస్టు 4న రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలో ‘గీతాంజలి’ మొదటి ముద్రణ పొందింది.
తర్వాత భారతీయ సాహిత్యంలో అంతగొప్ప కావ్యం మళ్లీ రాలేదు. 135 సంవత్సరాల తర్వాత శ్రీరామ్ రాసిన ‘హసితబాష్పాలు’ భారతీయ తాత్విక ఆధ్యాత్మిక మేళవింపుతో, అటు కవిత్వం స్థాయిని, ఇటు కావ్య స్థాయిని నాలుగు మెట్ల మీద ప్రతిష్ఠించిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కానేరదు. 2000 2010 మధ్యకాలంలో భక్తిమార్గం దేశంలో బలంగా ఉండేది. అలాంటి సమయంలో ప్రకృతి ఆరాధన ద్వారా దేవున్ని చేరుకోవడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ కావ్యం ద్వారా మార్గం చూపించాడు.
కావ్యంలో మానవుడిని కుంగదీసే నిరాశ, నిస్పృహలను సకల సృష్టిని ప్రేమభావంతో అవలోకనం చేసుకొని, తమ గొప్పతనాన్ని సూచించే సందేశం ఈ కావ్య ముఖ్య సారాంశం. అలాగే శ్రీరామ్ కవిత్వం చదివిన ప్రతీసారి మనలో కొత్త కొత్త లోతుల వైశాల్యాలను కొత్త వెలుగుల దివ్వెలు మన అంతః లోకాలను ఆక్రమిస్తూ తేజోమయం చేస్తాయి. కావ్యం మొదటి ఖండిక నుంచి చివరి ఖండిక వరకు ‘హసితబాష్పాలు లో మనకు ఎక్కువగా విరోధ భాస అలంకారాలు దర్శనమిచ్చి, మన మీద ప్రత్యేకమైన వినూత్న ముద్రలు వేస్తుంటాయి.
ఈ కవి తన గ్రంథానికి కన్నీరు పేరున 11 పేజీల ముందుమాట రాసుకున్నారు. అందులో వ్యతిరేకం అనుకునే ప్రతిదీ ఒక్కటే అని సెలవిస్తారు. మచ్చుకు ‘కన్నీళ్లు చిరునవ్వులు, జనన మరణాలు, మంచి చెడులు, ఉదయాస్తమయాలు, రాత్రి పగలు పరస్పర వ్యతిరేకాలు కావు. మనం అపార్థం చేసుకునే పరస్పర పర్యాయపదాలు. పైకి మాత్రమే కనిపించే వ్యతిరేకార్థాలు. ఒక దాని సమక్షాన్ని ఒకటి ఆనందిస్తాయి. ఒకదాని ఒకటి ఆలింగనం చేసుకుంటాయి. ఒకదానితో ఒకటి కరచాలనం చేసుకుని కలిసిపోయి కరిగిపోతాయి’ అంటారు కవి.
లోకరీతులు.. లోకనీతులు
కవితా సంపుటిలో చెక్ పడి జీవితం చిక్కుముడి ఓటమి అనుకున్న ప్రతిదానిని సునాయాసంగా విప్పి చెప్తారు కవి. ఈ ఖండికల కవిత్వాన్ని చదువుకుంటూ పోతే తమస్సు నిండిన మన మనసు లోగిలిలో దీపం వెలిగించినట్టు కాంతిమయమవుతుంది. అంతేకాదు శుభ్రపడుతుంది. జీవన జీవన విమర్శనమే కవిత్వం అన్నారు పాశ్చాత్య కవులు. మన తెలుగు ఆధునిక కవులు ‘కవిత్వమంటే కదిలించేది.. పెను నిద్దుర వదిలించేది’ అన్నారు. ఇది కవిత్వానికి సంబంధించిన ప్రయోజనాన్ని తెలుపుతుంది.
కావ్య ప్రయోజనాలు ధర్మార్థ కామ మోక్షాలలోనూ కళలతో, నైపుణ్యాన్ని కీర్తిని ప్రీతిని మన పూర్వఅలంకారికుడు భామహుడు సత్కావ్యం కలిగిస్తుందని చెప్పారు. మరో పూర్వ సంస్కృత విమర్శకుడు ‘కావ్యం యశస్సుకోసం, ధన సంపాదన కోసం, వ్యవహార జ్ఞానం కోసం, మంగళ హరణం కోసం, మోక్ష సాధన కోసం పాఠకుడు కళ్లు మూసుకుంటాడు. ప్రబోధం కోసం’ అని వివరిస్తాడు. మొత్తం మీద సాహిత్య సారాంశంలో తేలేందేమంటే సాహిత్యం విశ్వ కావ్య ప్రయోజనమని, దీనినే లోకప్రియత్యాన్ని పొందడం.
విశ్వజనీయత కల్పన కావ్యంలో లోకరీతులు, లోకనీతులు మానవ మనస్తత్వం కలగాపులగంగా కలిసి ఉంటాయి. ఇవన్నీ ఆనందంతో పాటు ఉపదేశ కారకాలుగానూ ఉంటాయి. ఇవన్నీ కలగలిసిన కవి శ్రీరామ్.. ‘ప్రభూ!’ అంటూ కవిత్వం ప్రారంభిస్తారు. ఇక్కడ ‘ప్రభూ’ అంటే కృష్ణ భగవానుడేనని నర్మగర్భంగా చెప్తారు. ఈయన కవిత్వం ప్రాచీన ఆర్వాచీన లాక్షణికులు చెప్పిన కావ్య లక్షణాలను ప్రయోజనాన్ని పునికి పుచ్చుకున్నదని రూఢీగా చెప్పొచ్చు. కావ్యం నుంచి అనేక కళ్లు హృదయం తళుక్కున చెమర్చే అనేక కవితా వాక్యాలను ఎత్తి చూపవచ్చు. ఈ కావ్యాన్ని కవి ఇంగ్లిషులోకీ అనువాదం చేస్తే చూడాలని నా ఆకాంక్ష. సవినయ విన్నపం.