calender_icon.png 3 November, 2025 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

సాహిత్య శిఖరం -‘కపిలవాయి’

03-11-2025 01:03:42 AM

తెలుగు సాహిత్య ప్రపంచంలో విభిన్న ప్రక్రియల్లో సృజనాత్మకతను ప్రతిష్ఠించిన శిఖరం కపిలవాయి లింగమూర్తి. కవిగా, రచయితగా, స్థలపురాణాల కర్తగా, పరిశోధకుడిగా, కావ్య పరిష్కర్తగా, శతక కవిగా ఆయన వాసికెక్కారు. కపిలవాయి లింగమూర్తి 1928 మార్చి 1న నాగర్‌కర్నూలు జిల్లా బల్మూరు మండలలం జినుకుంటలో జన్మించారు. తండ్రి చిన్న వయసులోనే పరమపదించారు. తల్లి మాణిక్యమ్మ అన్నీ తానై లింగమూర్తిని పెంచింది. తల్లి ప్రేమతో పెరిగిన ఆయనకు బయట ఆటపాటలకు అవకాశమే లేకుండాపోయింది. దీంతో పుస్తకాలే ఆయన నేస్తాలై, సాహిత్యమార్గాలై బలపరిచాయి. లింగమూర్తి ఉపాధ్యాయ జీవితం 1954లో నాగర్‌కర్నూలు ‘నేషనల్ స్కూల్’లో ప్రారంభమైంది.

అప్పటి నుంచి మూడు దశాబ్దాల పాటు ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలు బోధించారు. సమాంతరంగా తన రచనా వ్యాసాంగాన్నీ కొనసాగించారు. 1983లో ఉద్యోగ విరమణ చేసి, తర్వాత తన జీవితాన్ని సంపూర్ణంగా సాహిత్యానికే అంకితం చేశారు. 1958లో కపిలవాయి తొలి కథ ‘పురుషాకారం’ కృష్ణా పత్రికలో ప్రచురితమైంది. ఆయన సాహితీ ప్రపంచం విస్తృతమైనది, విభిన్నమైనది. ఆయన రచనలు కేవలం కవితా ప్రక్రియలకు పరిమితం కాకుండా, చరిత్ర, పురాణాలు, శతకాలు, నాటకాలు, నవలలు, యాత్రా, హరికథ, వ్యాఖ్యాన మొదలైన అనేక రూపాలను అల్లుకున్నాయి. 

ముఖ్యమైన రచనలు..

కవిలవాయి ముఖ్య శతకాల్లో జినుకుంట రామబంటు శతకం (1991), నాగర్‌కర్నూలు పండరినాథ విఠల శతకం (1972), తెల్లరాళ్లపల్లి తిరుమలేశ శతకం (1981), ఆర్యా శతకం (1978), దుర్గా భర్గ శతకం (1984), గద్వాల హనుమద్వచనాలు (వచన శతకం), ప్రేమ సాయి శతకం, సుందరి శతకం, ఆంధ్రకవి శతకం, మాన శతకం, శ్రీసాయి శతకద్వయం (2001), కృష్ణ నమస్కార శతకం, పరమహంస శతకం (1981), శ్రీ బుద్దారం గండి రామలింగేశ్వర శతకం, హనుమచ్ఛ శతకం,

పోతులూరి వీరబ్రహ్మ శతకం ముఖ్యమైనవి. కపిలవాయి సాహిత్య సృష్టిలో నవలలూ విశిష్ట స్థానం పొందాయి. ఆయన నవలలు చరిత్రాత్మక అంశాలను మాత్రమే కాక, సామాజిక సాంస్కృతిక నేపథ్యాన్నీ సమగ్రంగా ప్రతిబింబిస్తాయి. ‘మూడుతరాల ముచ్చట’ అనే నవల కపిలవాయి సృజనాత్మక శైలిని ప్రతిబింబించే కృతిగా నిలిచింది. నవల సంభాషణల రూపంలో కథనాత్మకంగా సాగుతుంది. పాలమూరు జిల్లాకు సంబంధించిన చారిత్రక అంశాలను లోతుగా ప్రతిపాదిస్తుంది. అలాగే ‘గంగోత్రి’ (తూమురెడ్ల చరిత్ర), ‘రామబ్రహ్మేంద్ర చరిత్ర’, ‘గోవిందమాంబ చరిత్ర’ వంటి కృతులు ప్రాచూర్యం పొందాయి. కపిలవాయి కథా రచయితగానూ తన ప్రతిభను చాటారు.

ఆయన కథలు తొలిరోజుల్లో ‘కలి.మూర్తి’ అనే కలంపేరుతో ప్రచురితమయ్యేవి. ఆయన కథల్లో ‘గోదాదేవి కథ’ ప్రాధాన్యత గలది.  తెలుగు సాహిత్యంలో స్థల మహాత్మ్య రచనలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ప్రక్రియలో కపిలవాయి సిద్ధహస్తుడు. స్థల పురాణాలు రాసేందుకు ఆయన వందలాది గ్రామాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల చరిత్రను, ఆలయాల స్థల పురాణాలను సేకరించి గ్రంథరూపమిచ్చారు. ఎక్కడికెళ్లినా అక్కడి దేవాలయాలను దర్శించి, దైవపూజా సంప్రదాయాలను పరిశీలించి, ప్రజా పురాణాలను విన్నారు.

అలా గ్రామచరిత్రలతోపాటు దైవ మహిమలను రాసిన ప్రబంధాలు, మహాత్మ్య గ్రంథాలు ఆయన రచనల్లో ఒక ప్రత్యేక పుంతను తీశాయి.చక్రతీర్థమాహాత్మ్యం (1980) గ్రంథం రాయడానికి వెనుక ఉన్న ఆంతరంగిక కారణమూ చారిత్రాత్మకమైంది. లింగమూర్తికి ఒక దశలో తీవ్రమైన తలనొప్పి వచ్చింది. ఎన్నిరకాల వైద్యచికిత్సలు చేసినా ఉపశమనం కలగలేదు. అప్పుడు ఆయన ‘తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకుంటే ఉపశమనం లభిస్తుంది’ అని భావించారు. ఆత్మలో దైవదర్శన కోరిక ఉప్పొంగినా, శరీరానికి కుదరని స్థితి ఏర్పడింది. అప్పుడు ఆయన ‘దైవస్మరణం’ ద్వారా ఆ తపన తీర్చుకోవాలని సంకల్పించారు. ఆ ఆత్మస్పూర్తి నుంచే ‘చక్రతీర్థ మహాత్మ్యం’ గ్రంథం పుట్టింది. 

జీవితయాత్రకు రూపం ‘సాలగ్రామం’

కపిలవాయి ఆత్మకథ ‘సాలగ్రామం’. ఇది ఆయన కుటుంబ చరిత్రకు, తన వ్యక్తిగత జీవితయాత్రకు సంక్షిప్త రూపం. ఈ రచనలో ఆయన పాండిత్యమూర్తి, సాహిత్య సృష్టికర్త మాత్రమే కాక, సంస్కృతీ వారసత్వాన్ని తనలో మోసుకువెళ్లిన మనిషి రూపం మనకు సాక్షాత్కరిస్తుంది. ఈ ఆత్మకథలో స్త్రీ విద్యాభ్యాసం, శిల్పకళ, కుటుంబ వారసత్వం, వ్యక్తిగత కృషి వంటి అనేక పార్శ్వాలు ఉన్నాయి. దీనిలో ప్రధాన పాత్ర మేడిపూరు గోవిందమ్మది. కపిలవాయి ఎదుగుతున్న ప్రాయంలో ఆమె అరుదైన విద్యావంతురాలు.

చిన్న వయసులో భర్త మరణంతో తండ్రి, అన్నల వద్ద ఉండి స్వర్ణశిల్పం సహా అనేక విద్యలు అభ్యసించింది. ఆమె కపిలవాయి తాతగారైన సింగవట్నానికి స్వయంగా స్వర్ణశిల్పంలో శిక్షణ ఇచ్చింది. ఆమె ఔన్నత్యాన్ని తన ఆత్మకథలో గొప్ప ఆవిష్కరించారు కపిలవాయి. ‘నా మొలక మామిడి నివాసం’ అనే అధ్యాయంలో కపిలవాయి చదువరితనం, జ్ఞానపిపాస బహిర్గతమవుతుంది. ఒకసారి ఆయన రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారయణ ‘వేయిపడగలు’ నవలను ఏకబిగిన చదివారట. ఇది ఆయనలోని పఠనాసక్తి, సాహిత్యమాధుర్యానురక్తిని చాటుతుంది. 

రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో ఆయన ప్రతిభకు లభించిన గుర్తింపులు విశేషమైనవి. 1983లో నాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుతో సన్మానం పొందారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, డాక్టర్ వెఎస్ రాజశేఖర్‌రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావుతోనూ ఆయన సన్మానాలు పొందారు. నలుగురు ముఖ్యమంత్రుల సత్కారం పొందిన అరుదైన కవిగా కపిలవాయి నిలిచిపోతారు.

ప్రతిదినమూ పద్య రచన, శతక సృజన, పురాణ పరిష్కరణలో నిమగ్నుడై జీవించిన కపిలవాయి 2018 నవంబర్ 6న శివైక్యం చెందారు. ఆయనపై ఇప్పటివరకు ఐదారు సిద్ధాంత వ్యాసాలు వెలువడ్డాయి. ఇంకా ఆయన రచనలు ప్రచురణకు నోచుకోనివి ఎన్నో ఉన్నాయి. వాటిని ప్రచురించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తే, తెలుగు సాహిత్య చరిత్రలో ఒక స్ఫుటమైన అధ్యాయం స్పష్టమవుతుంది. 

                           డాక్టర్ చిదానందం, 88014 44335