03-11-2025 11:57:07 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(Chevella Bus Accident) మండలం ఖానాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న మంత్రి పొన్నం ఘటన గురించి అధికారులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.... మృత్రుల అంత్యక్రియలు, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు స్పెషల్ అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 19 మరణించారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పొన్నం వివరించారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్లు ఆయన తెలిపారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించామని పొన్నం ప్రభాకర్ వివరించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం స్పష్టం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. బస్సు ప్రమాద బాధితులను మంత్రి పొన్నం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పరమార్శించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులు ఆదేశించారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యంపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై ఆర్టీసీ ఎండీ , పోలీస్ కమిషనర్ ఇతర అధికారులతో మంత్రి మాట్లాడారు. బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.