04-08-2025 12:26:12 AM
గజ్వేల్ మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్
గజ్వేల్, ఆగస్టు 3: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆగమైందని గజ్వేల్ మాజీ ఏఎంసి చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో మంజూరైన సుమారు రూ.1,02,500 విలువ గల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులని వివిధ అనారోగ్య కారణంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న అహ్మదీపూర్ గ్రామంలోని లబ్ధిదారులకు మాదాసు శ్రీనివాస్ అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని ఆరు గ్యారెంటీల మోసపూరిత హామీలు కుమ్మరించి అసమర్థ పాలనతో ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీశారని అన్నారు. ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు అని ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సంక్షేమంలో స్వర్ణయుగంలాగా కేసీఆర్ పాలన సాగిందని ఆయన గుర్తు చేశారు.
రైతు కుటుంబం బాధపడొద్దని రైతుబీమాను అమలు చేశారన్నారు. పెన్షన్లను అధిక మొత్తంలో పెంచారన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని అన్నారు. తెలంగాణలో కేవలం ఐదు మెడికల్ కాలేజీలు ఉంటే కేసీఆర్ గారు 33 మెడికల్ కాలేజీలను ప్రారంభించారని వైద్యరంగంలో విప్లవాత్మక మార్పుల కోసం శ్రీకారం చుట్టారన్నారు. గురుకుల పాఠశాలను సంఖ్యను పెంచారని అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం తెలంగాణలో నిర్మించి సాగు ,త్రాగు నీటి సమస్యను తీర్చారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నామ్ చేశాక నోటికి వచ్చిన వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టారని గుర్తు చేశారు. మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ రెచ్చగొట్టారని ఈరోజు నోటిఫికేషన్లు ఇవ్వమని నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన ఉలుకు లేకుండా చోద్యం చూస్తున్నారని అన్నారు.
ఎప్పటికైనా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేది బీఆర్‌ఎస్ పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ డైరెక్టర్ చాడ శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ , మాజీ కో అప్షన్ అహ్మద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నిజామోద్దీన్,కుంట కిష్టారెడ్డి, సత్యన్నారాయణ గౌడ్, కర్నాకర్ రెడ్డి, బుచ్చిరెడ్డి,మంద నరేష్, నాంపల్లి, మధు, మోహన్ రెడ్డి, లింగం, లబ్ధిదారుల కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.