04-08-2025 07:45:58 PM
"మనసు- మనిషి" పుస్తకావిష్కరణ..
మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): సమాజ హితాన్ని కోరుకునే వారి సంఖ్య పెరిగినప్పుడే అద్భుతాలు సృష్టించగలుగుతామని తెలంగాణ తొలి శాసనసభాపతి, శాసనమండలి సభ్యులు సిరికొండ మధుసూదనా చారి(Legislative Council Member Sirikonda Madhusudhana Chary) అన్నారు. ఉదయం మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సైకాలజిస్ట్, కౌన్సిలింగ్ ఎక్స్ పర్ట్, ఉదయం మాజీ పాత్రికేయులు మెండు ఉమామహేశ్వర్ రాసిన "మనసు-మనిషి" పుస్తకావిష్కరణ సభ హనుమకొండ కిషన్ పురలోని వాగ్దేవి ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఉదయం మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రముఖ పాత్రికేయులు దాసరి కృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి మాట్లాడుతూ, కసి, కృషి ఉంటేనే మనిషి ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతాడన్నారు.
ఎన్నో ప్రతికూలతలను చిన్ననాటి నుండి ధైర్యంగా ఎదుర్కొని ఎదిగిన వ్యక్తి పుస్తక రచయిత మెండు ఉమామహేశ్వర్ తన అనుభవాల సారాన్ని మనసు - మనిషి పుస్తకంలో దర్శింప చేశాడన్నారు. ప్రస్తుత సమాజంలో మానవజాతి కలుషితమైపోయిందనీ, ఇది అణు బాంబు కన్నా ప్రమాదకరంగా మారిందన్నారు. మన జీవితాలు ఉదయం కల్తీ తో ప్రారంభమై కల్తీతో ముగుస్తున్నాయన్నారు. అద్భుతాలు సృష్టించే వారంతా అతి సాధారణ కుటుంబాల నుంచే వచ్చారన్నారు.
ఆవిష్కరణ సభకు ప్రధాన వక్తగా విచ్చేసిన సీనియర్ పాత్రికేయులు శంకేసి శంకర్ రావు పుస్తక విశ్లేషణ చేస్తూ మనిషిని నియంత్రించే మనసు మన చేతిలో లేదని అది మార్కెట్ శక్తుల నియంత్రణలోకి వెళ్లిందన్నారు. ఈ పుస్తకాన్ని ఇటీవల మరణించిన తన సోదరుడు ప్రముఖ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ కు అంకితం ఇవ్వడం సోదరుల మధ్య ఉన్న ఆప్యాయతకు నిదర్శనం అన్నారు. ఈ పుస్తకావిష్కరణ సభలో రచయిత మెండు ఉమామహేశ్వర్, ప్రముఖ సైకాలజిస్ట్ జి. నాగేశ్వరరావు, పిఆర్టియు హనుమకొండ మండల శాఖ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, మైమ్ కళాధర్, మిమిక్రీ ఆర్టిస్ట్ రాంపల్లి సదాశివ, సమావేశ సమన్వయకర్త ఆర్. లక్ష్మణ్ సుధాకర్, ఉదయం పూర్వపాత్రికేయులు, పెద్ద సంఖ్యలో మేధావులు పాల్గొన్నారు. అనంతరం రచయిత మెండు ఉమా మహేశ్వర్ ని ఉదయం మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన, వివిధ ఉపాధ్యాయ సంఘాల పక్షాన ఘనంగా సత్కరించారు.