04-08-2025 07:48:36 PM
- శుద్ధి చేసిన తాగునీటిని ప్రతి గడపకు అందించాలి
- లింగోటం నుండి 70 ఎమ్ ఎల్ డి తీసుకునేలా ప్రణాళికలు
- మిషన్ భగీరథ అధికారుల సమీక్ష సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
మునుగోడు (విజయక్రాంతి): ప్రజల ఆరోగ్యం పని పట్ల నిబద్ధత ఉన్న అధికారులు మాత్రమే ఉండాలని సమయపాలన చేసే అధికారులు ఉండొద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. సోమవారం నియోజకవర్గ కేంద్రంలోని అధికారిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గానికి సరిపడా శుద్ధిచేసిన త్రాగునీరు అందించాలంటే లింగోటం నుండి 70 ఎంఎల్డి నీటిని తీసుకోవాలన్నారు. ప్రస్తుతం లింగోటం వద్ద 70 ఎంఎల్డి నీరు లభిస్తున్నప్పటికీ దేవరకొండ నియోజకవర్గం కూడా ఇక్కడినుండే తాగునీటి సరఫరా అవుతుంది. అయితే దేవరకొండ నియోజకవర్గానికి ప్రత్యేకంగా 50 ఎంఎల్డి నీటిని అందించే విధంగా నీటి శుద్ధి ప్లాంట్లను నిర్మిస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ప్రభుత్వ లెక్కల కంటే అత్యధికంగా జనాభా నివసిస్తున్నారని పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం మిషన్ భగీరథ నీరు సరిపోవడం లేదన్నారు.చౌటుప్పల్ మున్సిపాలిటీ,నారాయణపూర్ మండలాలకు ప్రతిరోజు సరిపడా శుద్ధి చేసిన తాగునీటి అందించాలంటే లింగోటం నుండి 70 ఎంఎల్డి నీటిని తీసుకోవాల్సి ఉంటుందన్నారు.. కాంటురు రేఖల ప్రకారం లింగోటం నుండి అందించడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని అన్నారు. గ్రామాలలో శుద్ధిచేసిన మిషన్ భగీరథ నీరు అందించాల్సిన బాధ్యత మిషన్ భగీరథ అధికారులపైనే ఉందని, బోర్ వాటర్, మిషన్ భగీరథ వాటర్ వేర్వేరు పైపులైన్ల ద్వారా అందించాలన్నారు.. గ్రామాలలో నీటి సరఫరా ఎలా ఉంది, మిషన్ భగీరథ నీటికి ప్రత్యేకమైన వాటర్ ట్యాంకులు ఉన్నాయా లేవా, మిషన్ భగీరథ నీరు ప్రతి నివాసానికి పంపిణీ చేసే విధంగా ప్రపోజెన్సు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
నీరే మనిషికి జీవనాధారం అని శుద్ధి చేయని నీటిని తాగడం వల్ల ప్రజలు 90 శాతం రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మనిషి తక్కువ తిని ఎక్కువ నీరు తాగితేనే ఆరోగ్యంగా ఉంటారని ఎక్కువ నీరు తాగాలంటే మిషన్ అధికారులు బాగా పనిచేయాలని చురకలు అంటించారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన గురుదర బాధ్యతలు మిషన్ భగీరథ అధికారులు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు.మిషన్ భగీరథ నీటి సరఫరా పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, మిషన్ భగీరథ నీటి సరఫరా పై ఇప్పటినుండి ప్రతి నెల సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అన్ని మండలాల ముఖ్య నాయకులతో పాటు ఈఈ భువనగిరి కరుణాకరన్, ఈఈ లక్ష్మీనారాయణ, ఈ ఈ శాంతి కుమారి, డిఈ లు దీన్ దయాల్, సంపత్ లు, ఏఈలు ఉన్నారు.