calender_icon.png 7 October, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం

07-10-2025 01:43:39 AM

-కార్పొరేట్‌కు దీటుగా సర్కార్ బడులు

-మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

-రూ.7.7 కోట్లతో ఎర్రమంజిల్‌లో అత్యాధునిక పాఠశాల భవనం ప్రారంభం  

-అన్ని గదులను ఏసీ, డిజిటల్ క్లాస్‌రూమ్‌లుగా మార్చాలని మంత్రి ఆదేశం  

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 6 (విజయక్రాంతి): రాష్ర్టంలో విద్యారంగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, పేద విద్యార్థులకు ఉన్నతమైన, నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని రాష్ర్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రమంజిల్‌లో రూ. 7.7 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభు త్వ పాఠశాల భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ రియాజుల్ హసన్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరిలతో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భం గా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, పేదల సంక్షేమానికి, వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందులో భాగంగానే ఎర్రమంజిల్‌లో కార్పొరేట్ స్థాయిలో ఈ పాఠశాలను నిర్మించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ర్టంలోనే ఇంత గొప్పగా, అనుకున్న సమయానికి ఈ పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, నిర్మాణాన్ని చేపట్టిన మెగా సంస్థ యాజమాన్యం కృష్ణారెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని మంత్రి అన్నారు. పాఠశాలను పరిశీలించిన అనంతరం, అన్ని తరగతి గదులను పూర్తిస్థాయి ఏసీ క్లాస్‌రూమ్‌లుగా, స్మార్ట్ డిజిటల్ బోర్డులతో ఆధునికీకరించాలి, అని సంబంధిత అధికారులను మంత్రి అక్కడికక్కడే ఆదేశించారు.

రాష్ర్టంలోని ప్రతి నియోజకవర్గానికి రూ. 200 కోట్ల వ్యయంతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను’ ఏర్పాటు చేయాలనే బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి పునరుద్ఘాటించారు. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఈ నూతన పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం తన ఎంపీ నిధుల నుంచి రూ. 25 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ, ఈ పాఠశాల హైదరాబాద్ నగరానికే ఒక మోడల్ స్కూల్‌గా నిలుస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయ రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్లు లింగారెడ్డి, రాజారెడ్డి, డీఈఓ ఆర్. రోహిణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.