calender_icon.png 7 October, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కట్ట రోడ్డు ‘మట్టి’ కొట్టుకుపోతుంది

07-10-2025 12:17:44 AM

  1. కలగా మారిన కుమ్మరికుంట కట్టపై బీటీ రోడ్డు 
  2. గాలికి కొట్టుకుపోయిన ప్రజాప్రతినిధుల హామీలు 
  3. ఎంపీ, ఎమ్మెల్యే వచ్చినప్పుడే రోడ్డు వేస్తామని ప్రతిజ్ఞలు 
  4. గుంతలు పడిన మట్టి రోడ్డుపై ప్రయాణికుల అవస్థలు 
  5. బీటీ రోడ్డు నిర్మించాలని హయత్ నగర్ ప్రజల డిమాండ్ 

ఎల్బీనగర్, అక్టోబర్ 5 : హయత్ నగర్ లోని కుమ్మరి కుంట కట్టపై తారు రోడ్డు నిర్మాణం కలగా మారింది. ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తున్నారు. కట్టపై బీటీ రోడ్డు వేస్తామని, కుంటను సుందరీకరణ చేస్తామని, కట్టను వెడల్పు చేస్తామని అనేక గాలి హామీలు ఇచ్చారు. కానీ, కుమ్మరి కుంట కట్టపై ఉన్న మట్టి వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయి జల్లెడ మాది రిగా గుంతలు పడ్డాయి. కుంట కట్టపై ఉన్న మట్టి పూర్తిగా మట్టికొట్టుకుపోయి గుంతలు పడింది.

20 కాలనీలకు పైగా, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం డివిజన్లను హయత్ నగర్ డివిజన్ తో కుమ్మరి కుంట కట్ట అనుసంధానం చేస్తుంది. దీంతో పాటుగా రెండు జాతీయ రహదారులు విజయవాడ, సాగర్ రింగ్ రోడ్డును సైతం అనుసంధానం చేస్తుం ది. నిత్యం వందలాది వాహనాలు కట్టపై నుంచి వెళ్తుంటాయి. సరైన రోడ్డు లేకపోవడం, మట్టి రోడ్డుపై అడుగడుగునా గుంత లు పడడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

వస్తారు.. చూస్తారు.. హామీలు  ఇస్తున్నారు 

ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఏ ఎన్నికలు వచ్చినా కుమ్మరి కుంట కట్టపై బీటీ రోడ్డు నిర్మాణంపై ప్రతి రాజకీయ పార్టీ హామీ ఇస్తుంది. తీరా గెలిచాకా... రోడ్డు కాదుకదా.. కుంటను సైతం పట్టించుకోరు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో సైతం అభ్యర్థులు హామీ ఇచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ సైతం హయత్ నగర్ కుమ్మరి కుంట కట్టపై బీటీ రోడ్డు వేస్తామని ప్రతిజ్ఞలు చేశారు.

ఒక్క రోడ్డే కాదు... కుంటను సుందరీకరణ చేస్తామని, కట్టను వెడల్పు చేస్తామని, కుంట స్థలాన్ని కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటామని, కుంటలోకి మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చారు. ఇటీవల ఎంపీ ఈటల రాజేందర్ కుంటను పరిశీలించి, రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని స్థానికులు, వివిధ కాలనీల సంఘాల నాయకులు సమక్షంలో హామీ ఇచ్చారు.

నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించలేదు. ఎమ్మెల్యే, కార్పొరేటర్ వేర్వేరుగా కుంట కట్టపై రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. వివిధ స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులు రోడ్డు నిర్మాణంపై అనేక సార్లు హామీలు ఇచ్చినా... రోడ్డు నిర్మాణం కలగా మారింది.

మట్టి రోడ్డుపై అడుగ డుగునా గుంతలు 

రెండు జాతీయ రహదారులను అనుసంధానికి కీలకమైన కుమ్మరి కుంట కట్ట అనాథగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుమ్మరి కుంట కట్ట రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. అడుగడుగునా గుంతలు పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం గుంతలను మట్టితో చదును చేశారు. కొద్దిపాటి వర్షానికే మట్టికొట్టుకుపోయి అడుగడుగునా గుంతలు పడ్డాయి.

దీంతో వాహన దారులు, ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కట్ట రోడ్డుపై వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ రోడ్డుపై వెళ్లే వాహనాలకు తరచూ మరమ్మతులు చేయించాల్సి వస్తుందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కండ్ల ముందు కనిపిస్తున్నా... ప్రజలు ఫిర్యాదు చేసినా జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించడం లేదు.

కనీసం గుంతలు పూడ్చడానికి కూడా అధికారులు సాహసించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం గుంతలు పూడ్చి, వాహనాలు సాఫీగా వెళ్లే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని హయత్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం డివిజన్ల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. 

కట్టపై నుంచి వెళ్లలేని పరిస్థితి

నీను హయత్ నగర్ లో ఉంటాను. వివిధ పనులపై ప్రతి రోజూ కనీసం నాలుగైదు సార్లు కుమ్మరి కుంట కట్టపై బైక్ పై వెళ్తాను. తారు రోడ్డు వస్తుందని ఏండ్లుగా ఎదురు చూస్తున్న. కనీసం మట్టితో రోడ్డును చదును చేయడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై అడుగడుగునా గుంతలు పడ్డాయి.

గుంతల మీదుగా వెళ్తే బైక్ చెడిపోతుంది. రిపేర్లకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. తారు రోడ్డు తర్వాత ముందుగా రోడ్డుపై ఉన్న గుంతలను కనీసం మట్టితో పూడ్చి వాహనాలు వెళ్తే విధంగా చర్యలు తీసుకోవాలి.

  1. తూర్పాటి వెంకటేశ్, హయత్ నగర్ నివాసి
  2. అధికారుల సమన్వయం లోపం శాపంగా మారింది 

హయత్ నగర్ లోని కుమ్మరి కుంట కట్ట రోడ్డు రెండు జాతీయ రహదారులు (విజయవాడ, సాగర్ రింగ్ రోడ్డు)ను అనుసంధానం చేయడంతోపాటు బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురంలోని ఆయా కాలనీలకు కీలకం. రూ,6 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణంపై ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీ శాఖల అధికారుల సమన్వయం లోపం శాపంగా మారుతోంది. ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఎన్వోసీని జీహెచ్‌ఎంసీ అధికారులు వివిధ సాంకేతిక కారణాలను చూపించి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంటు న్నారు. కుమ్మరి కుంట కట్టపై బీటీ రోడ్డు నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయి. త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభించడానికి కృషి చేస్తాను. 

-- కళ్లెం నవజీవన్ రెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్