calender_icon.png 5 January, 2026 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యథావిధిగా ‘ఉపాధి హామీ’ కొనసాగించాలి

03-01-2026 12:04:14 AM

  1. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం 
  2. వీబీజీరామ్‌జీ.. పేదల హక్కులు దెబ్బతీసేలా ఉంది 
  3. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
  4. కూలీలను కార్పొరేట్‌కు దారదత్తం కుట్ర 
  5. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, జనవరి 2  (విజయక్రాంతి): మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆరు అంశాలతో కూడిన తీర్మానం కాపీని కేంద్రానికి పంపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించి, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు గత యూపీఏ ప్రభుత్వం 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో ఉపాధి హామీ పథకం తీసుకురాగా, 2006 ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చిందని చర్చించారు.

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీజీ రాంజీ చట్టం అమలు చేయవద్దని తెలంగాణ అసెంబ్లీలో మంత్రి సీతక్క శుక్రవారం స్వల్పకాలిక చర్చకు ప్రవేశపెట్టారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీజే పీ, ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేలు చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ .. గ్రామాల్లో ప్రతి కుటుంబానికీ 100 రోజులు ఉపాధి క ల్పించి, కనీస వేతనం అందించే గ్యారెంటీ అని తెలిపారు.

గత 20 ఏళ్లుగా ఈ పథకం ద్వారా మన రాష్ట్రం లో సుమారు 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలు లబ్ధిపొందారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (వీబీజీరామ్‌జీ) చట్టం పేదల హక్కులను దెబ్బతీసేలా ఉందని సీఎం ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేలా కొత్త చట్టం తీసుకొచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ చర్చలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుందనే బీఆర్‌ఎస్ నేతలు సభ నుంచి వెళ్లిపోయారని విమర్శించారు..

రాష్ట్రంపై అదనంగా 1,800 కోట్ల భారం: సీతక్క 

ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం రద్దుచేయడం అన్యాయమని మంత్రి సీతక్క విమర్శించారు. రాష్ట్రాలపై 40 శాతం భారం వేయకుండా, గతంలో మాదిరిగానే 100 శాతం కేంద్రమే భరించాలని డిమాండ్ చేశారు. వీబీజీ రామ్‌జీ చట్టాన్ని అమలు చేస్తే రాష్ట్రంపై అదనంగా ఏడాదికి రూ.1800 కోట్ల భారం పడుతుందన్నారు.