02-09-2025 12:00:00 AM
-ఉద్యోగులను రెండు వర్గాలుగా చేయడం సరికాదు
-కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి
-లేకుంటే మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతాం..
-తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్
-సీపీఎస్ ఉద్యోగులకు ఇదే చివరి విద్రోహదినం కావాలి
-తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి
ముషీరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్‌లో సోమవారం పాత పెన్షన్ సాధన పోరాటానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు ఉద్యోగుల జేఏసీ నాయకులు హాజరై మాట్లాడారు.
మారం జగదీశ్వర్ మాట్లాడుతూ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రాష్ట్రంలోని రెండున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉరితాడుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్, ఓపీఎస్ అంటూ ఉద్యోగులను రెండువర్గాలుగా విభజించడం సరికాదన్నారు.
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో తదితర రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేసినట్టే, తెలంగాణలోనూ ఈ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే లక్షలాది మంది ఉద్యోగులతో మరో ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాస్‌రావు, కో- చైర్మన్ చావా రవి, సదానందగౌడ్, వంగ రవీందర్‌రెడ్డి, ఏ సత్యనారాయణ, మధుసూదన్‌రెడ్డి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఓపీఎస్ అమలు చేస్తే సీఎం చరిత్రలో నిలుస్తారు..
సీపీఎస్ ఉద్యోగులకు ఇదే చివరి విద్రోహదినం (సెప్టెంబర్ 1) కావాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి ఆకాంక్షించారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. సీపీఎస్ విధానంలో లోపాలున్నందునే యూపీఎస్‌ను తీసుకొచ్చారని చెప్పారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ మద్దతుతో తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభలో లచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
సీపీఎస్‌ను రద్దు చేయడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారమేమీ లేదని.. ఓపీఎస్‌ను అమలు చేస్తే సీఎం రేవంత్‌రెడ్డి చరిత్రలో నిలుస్తారని పేర్కొన్నారు. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు శాపంగా మారిందన్నారు. ఉద్యోగులకు పెన్షన్ భిక్ష కాదని, కనీస హక్కు అని వాపోయారు. రిటైర్డ్ ఉద్యోగులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. సీఎం తమ సమస్యను మానవీయ కోణంలో చూడాలని కోరారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఏ కోదండరాం మాట్లాడుతూ పెన్షన్ ప్రాథమిక హక్కు అని ఇటీవల సుప్రీం కోర్టు తన తీర్పులో వెల్లడించిందన్నారు. ఉద్యోగి పెన్షన్ పెట్టుబడిదారుల చేతిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ ఉద్యోగుల హక్కుగా ప్రభుత్వం గుర్తించాలన్నారు.
ఈ సభలోని అంశాలను ప్రభుత్వానికి చేరుస్తానని, గతంలో చీఫ్ సెక్రటరీకి ఓ నివేదిక సమర్పించినట్టు చెప్పారు. సీపీఎస్ ఉద్యమానికి నా వంతు మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగుల సమస్యపై ఇప్పటికే గవర్నర్‌తో పాటు అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి వినతులిచ్చినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 2014లో నూతన పెన్షన్ విధానాన్ని ఒప్పుకోనందునే సీపీఎస్ అమలవుతుందన్నారు. ఉద్యోగుల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు కే రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి పాదించిన ఏకీకృత పెన్షన్ విధానాన్ని (యూపీఎస్) తిరస్కరించాలని డిమాండ్ చేశారు. షేర్ మార్కెట్ ఒడిదుడుకుల మీద ఆధారపడి పెన్షన్ ఇవ్వడమన్నది ఎండమావిలో నీటిని వెతకడమే అవుతుందన్నారు. తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎల్ దర్శన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేఏసీ కో- చైర్మన్, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం జనరల్ సెక్రటరీ, తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కే రామకృష్ణ, జనరల్ సెక్రటరీ నాగవల్లి ఉపేందర్, ఎస్ రాములు, రాధ, ఎం శ్రీనివాస్ శంకర్, కే హన్మంత్‌రావు, దేవేందర్, జీ కృపాకర్, కే రాములు, బాణాల రాంరెడ్డి, పాక రమేశ్, డాక్టర్ జీ నిర్మల, అశ్వథామరెడ్డి, డాక్టర్ కత్తి జనార్ధన్, హబీబ్ మస్తాన్, గరికే ఉపేందర్‌రావు, ఎస్‌వీ సుబ్బయ్య, మహిపాల్ రెడ్డి, ఊదరి గోపాల్, పీహెచ్ రవి, ఎస్ నర్సింలు, రొక్కం దేవిక, బీ సుదర్శన్ గౌడ్, ఎం.చంద్రశేఖర్‌గౌడ్, కొంగల వెంకట్, కే సాయిరెడ్డి, పీ లక్ష్మయ్య, ఎస్ నర్సింలు, ఆవుల సైదులు, రాందాస్, డాక్టర్ రామకృష్ణ, ఎస్ హరికిషన్, కే సందీప్ కుమార్, మహమ్మద్ మోహినుద్దీన్, ఆర్ కిరణ్‌కుమార్, శ్రీకాంత్, హేమలత, జీ మహేశ్‌కుమార్, సుగంధిని, రాంబాబు, చైతన్య కృష్ణ, మల్లేశం, రాందాస్ శోభన్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.