calender_icon.png 5 July, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజినీర్లదే బాధ్యత!

12-06-2025 01:42:09 AM

వన్ టూ వన్.. 50 నిమిషాలు.. 18 ప్రశ్నలు 

  1. క్యాబినెట్ నిర్ణయం మేరకే ప్రభుత్వం కాళేశ్వరం చేపట్టింది
  2. వ్యాప్కోస్ నివేదికపై తుమ్మిడిహట్టి నుంచి లొకేషన్ మార్పు
  3. టెక్నికల్ టీం చెప్పినట్టుగానే బరాజ్‌ల నిర్మాణం
  4. ఇంజినీర్ల నిర్ణయం మేరకే మేడిగడ్డలో నీటి నిల్వ
  5. నిధుల కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు
  6. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 
  7. అనారోగ్యం కారణంగా ఇన్ కెమెరా విచారణ

హైదరాబాద్, జూన్ 11(విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తనకేమాత్రం సంబంధం లేదని ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత అంతా ఇంజినీర్లదేనని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఉత్కంఠను రేకెత్తిస్తూ, బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. కమిషన్ విచారణకు పిలిచిన సమయానికి ముందుగానే, ఉద యం 11 గంటలకు ఆయన బీఆర్‌కే భవన్ చేరుకున్నారు.

సరిగ్గా 12 గంటలకు విచారణ ప్రారంభమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సం బంధించి పలు అంశాలపై కేసీఆర్‌ను 50 నిమిషాల పాటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. 115వ సాక్షిగా కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన కేసీఆర్.. జలుబుతో స్వల్ప అనారోగ్యంగా ఉందని, విచారణ సమయంలో ఇతరులు ఎవరూ ఉండొద్దని కోరగా, కమిషన్ దానికి అంగీకరించింది.

మీడియాతో పాటు ఇతరులెవరూ లేకుండానే కేసీఆర్‌ను కమిషన్ ప్రశ్నించింది. కాళే శ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై సొంతంగా తయారు చేసుకున్న ఒక నివేదికతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నివేదికను కూడా కేసీఆర్ కమిషన్‌కు అందిం చారు. ఈ సందర్భంగా మాజీ సీఎంకు కాళేశ్వరం కమిషన్ 18 ప్రశ్నలను సంధించినట్లు సమాచారం. 

డిజైన్లు, నిర్మాణం, ఆపరేషన్స్ దేనితో తనకేం సంబంధం లేదు..

ఎప్పటి నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారనే మొదటి ప్రశ్నతో కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల్లో తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు లొకేషన్ మార్పు నిర్ణయంపై కమిషన్ కేసీఆర్‌ను ప్రశ్నించింది. అలాగే ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించగా.. కాళేశ్వరం రీఇంజినీరింగ్ గురించి కేసీఆర్ వివరించారు.

రీఇంజినీరింగ్ అంశాన్ని 4 వేల మంది ఇంజినీర్లు పరిశీలించారని తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన వ్యాప్కోస్ (వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్) ఇచ్చిన నివేదిక మేరకు లొకేషన్ మార్చినట్లు వివరించారు. మూడు చోట్ల ఆనకట్టలు కట్టాలని వ్యాప్కోస్ సిఫారసు చేసిందన్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ సహా గోదావరి మొత్తం వ్యాప్కోస్ సంస్థ సర్వే చేసిందని కమిషన్ దృష్టికి తీసుకుపోయారు.

అలాగే తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర సర్కారు అభ్యంతరం చెప్పిందన్నారు. తుమ్మడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ఆనకట్ట నిర్మాణానికి మహారాష్ర్ట అంగీకరించలేదని కేసీఆర్ కమిషన్‌కు తెలిపారు. లొకేషన్ మార్పునకు కేంద్రం అంగీకరించిందని.. ప్రాజెక్ట్ నిర్మాణానికి అన్ని అనుమతులు (జల శక్తి మంత్రిత్వ శాఖ టెక్నికల్ అడ్వుజరీ కమిటీ ఆమోదం, జూన్ 2018లో) తీసుకున్నామని తెలిపారు. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. 

క్యాబినెట్ ఆమోదంతోనే..

ఆనకట్టల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం ఉందా అని కమిషన్ ప్రశ్నించింది. అందుకు సమాధానంగా క్యాబినెట్ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులు తీసుకున్నామని తెలిపారు. కాళేశ్వరం కార్పోరేషన్ (కేఐపీసీఎల్) గురించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆరా తీసింది. కొత్త రాష్ర్టంలో నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకొని కార్పోరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నిధుల సమస్య లేకుండా చూస్తూ కాళేశ్వరం వేగంగా పూర్తిచేసేందుకే కార్పోరేషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక నీటి విడుదల తర్వాత వచ్చే ఆదాయంతో కార్పోరేషన్ అప్పులను చెల్లించాలని భావించామని చెప్పినట్లు తెలుస్తోంది. కరోనా, ఇతర కారణాల వల్ల కాళేశ్వరం కార్పోరేషన్‌కు ఆదాయం రాలేదని చెప్పారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినందున ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాల్సి వచ్చిందని కేసీఆర్ తెలిపారు.

బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలని మీరు ఆదేశించారా అని కమిషన్ వేసిన ప్రశ్నకు, కేసీఆర్ తనకు సంబంధం లేదని చెప్పారు. అది ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజనీర్లు తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజినీర్లు చూసుకుంటారని, తనకు ఆ అంశం తెలియదన్నారు. నీటి నిల్వ అనేది రాజకీయపరమైన నిర్ణయం కాదని సమాధానమిచ్చారు.

బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు, సాంకేతిక అంశాలు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం చేపట్టినట్లు కేసీఆర్ వివరించారు. కాళేశ్వరం నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు కేసీఆర్ కమిషన్‌కు తెలిపారు. ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ విభాగానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను అందుబాటులో ఉండేలా చూశామని తెలిపారు.

ఆపరేషన్, నిర్వహణ కోసం రూ.280 కోట్లు కేటాయించామని కమిషన్‌కు  కేసీఆర్ వివరించారు. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు విచారణ గదిలోకి కేసీఆర్ వెళ్లారు. తర్వాత 12.50 గంటలకు విచారణ పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. దాదాపుగా 50 నిమిషాల పాటు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కేసీఆర్, కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్, కమిషన్ కార్యదర్శి మాత్రమే ఉన్నారు. ఇప్పటి వరకు 114 మంది విచారణలో ఎవరూ ఇన్ కెమెరా విచారణ కోరలేదు. 

బీఆర్కే భవన్ భారీగా తరలివచ్చిన నేతలు, పార్టీ శ్రేణులు

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హజరయ్యేందుకు ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్ నుంచి హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌కు వచ్చే దారిలో బీఆర్‌ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కమిషన్ ముందు ఉదయం 11.30 గంటలకు హాజరుకావాల్సి ఉండగా ఉదయం 9.40 నిమిషాలకే ఎర్రవెల్లి నుంచి కేసీఆర్ బయలుదేరారు.

అక్కడ ఆయనతో పాటు శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు హారీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు సుభాష్ రెడ్డి, కవిత, మాజీ ఎంపీ సంతోష్ తదితరులున్నారు. కార్లతో పెద్ద ఎత్తున ర్యాలీ తీయగా.. కేసీఆర్ 11 గంటలకు బీఆర్కే భవన్‌కు చేరుకున్నారు

. అయితే బీఆర్కే భవన్ దగ్గర కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. కేసీఆర్‌తో పాటు కొంత మంది నేతలను మాత్రమే కమిషన్ కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతించారు. అయితే బీఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీసులతో అనేక సార్లు వాగ్వాదానికి దిగారు. 

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద  నాయకుల సందడి

కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం ఉదయం ఎర్రవల్లి ఫాంహౌ స్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, గజ్వేల్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ప్రతాప్‌రెడ్డి, భారీ సంఖ్యలో కార్యకర్తలు బీఆర్కే భవన్‌కు తరలి వెళ్లారు.

ఎమ్మెల్సీ కవిత గురించే చర్చ 

ఇటీవల కేసీఆర్‌కు తన కుమార్తె కవిత బ హిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీం తో పార్టీలో ఏం జరుగుతోందంటూ జోరుగా చర్చ జరుగుతున్నది. బుధవారం కాలేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు బయలుదేరిన కేసీఆర్ ఇంటికి కవిత దంపతులు రావడం చర్చనీయంశంగా మారింది. 

నెంబర్ 115.. 

ఈ నెల 9వ తేదీ వరకు కాళేశ్వరం కమిషన్ 114 మందిని సాక్షులుగా పిలిచి విచారణ జరిపింది. 113వ సాక్షిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, 114వ సాక్షిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరవ్వగా.. బుధవారం కేసీఆర్ 115వ సాక్షిగా కమిషన్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్- కాగ్ నివేదిక సహా విజిలెన్స్ విభాగం, ఎన్డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికను పరిశీలించింది.

విచారణ దాదాపుగా పూర్తయిన తరుణంలో ఇప్పటికే దాదాపుగా 400 పేజీల నివేదికను సిద్ధం చేసింది.  కేసీఆర్ విచారణ పూర్తయిన నేపథ్యంలో దాదాపుగా ఈ నెలాఖరులోగా కమిషన్ నివేదిక అందిస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీలో సభ్యుడైన అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును సైతం విచారణకు పిలుస్తారని చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.

పల్లాకు కేసీఆర్ పరామర్శ

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో పల్లా జారిపడటంతో ఆయన తుంటి ఎముకకు గాయం అయింది. దీంతో రాజేశ్వర్ రెడ్డిని చికిత్స కోసం హైదరాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. కాళేశ్వరంపై కమిషన్ విచారణ ముగిసిన వెంటనే కేసీఆర్ నేరుగా యశోదా ఆసుపత్రికి చేరుకొని పల్లా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పల్లా ఆరోగ్య విషయమై వైద్యులతో మాట్లాడి తిరిగి ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోయారు.