07-07-2025 12:00:00 AM
సెంటర్ ఫర్ బ్రాహ్మిణ్ ఎక్సలెన్స్ సన్మాన సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): రాజకీయాలకు అతీతంగా బ్రాహ్మణ సమాజమంతా ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు పిలుపునిచ్చారు. బ్రాహ్మ ణ సమాజం ధర్మాన్ని నిలబెట్టేవారని, బహుజన ప్రియులని తెలిపారు.
ఆదివారం బేగంపేటలో పుష్పగిరి జగద్గురు సంస్థానంలో సెంటర్ ఫర్ బ్రాహ్మిణ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభివనోద్ధండ విద్యాశంకర భారతీ స్వామి సమక్షంలో రాంచందర్ రావును ఘనంగా సన్మానించారు. అందరూ తనను సాఫ్ట్ అని అనుకుంటారని, కానీ దేశమన్నా, ధర్మమన్నా ఆయుధాలు కలిగిన సైనికునిలా తాను అత్యంత కఠినంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అందరూ తనకు మద్దతునిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. అందరి ప్రోత్సాహంతో మరింత ధైర్యంగా ముందు కు వెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఐఏఎస్ అధికారి డా. కేవీ రమణాచారి అధ్యక్షత వహించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, మాజీ డీజీపీ అరవింద్‌రావు, ఆర్థిక వేత్త ఎస్వీ రావు, బీజేపీ నాయకురాలు మాధవీలత, వనం జ్వాలా నర్సింహా రావు, సెంటర్ ఫర్ బ్రాహ్మిణ్ ఎక్సలెన్స్ అధ్యక్షుడు వద్దిరాజు విజయ్, దర్శనం శర్మ, కప్పర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.