07-07-2025 12:00:00 AM
-పారిశ్రామిక ప్రాంతంలో పరేషాన్
-మేజర్ పంచాయతీలో అన్నీ సమస్యలే..
-జాడలేని ప్రత్యేక అధికారులు
-వీధి దీపాలు లేక కాలనీల్లో అంధకారం
మనోహరాబాద్(తూప్రాన్), జూలై 6 : గ్రామ పంచాయతీల్లో పాలన అస్తవ్యస్థంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిధుల్లేక గ్రామాల అభివృద్ధి అటకెక్కింది. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడి పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పెరిగింది.
కనీసం వీధి దీపాలు, బోర్ల మరమ్మతు, జీపీ ట్రాక్టర్లకు డీజిల్ కూడా కొనలేని పరిస్థితి ఉంది. మనోహరాబాద్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ కాళ్ళకల్ గ్రామంలో అన్నీ సమస్యలే నెలకొన్నాయి. పారిశ్రామిక ప్రాంతంగా పేరొందినా ఎక్కడ చూసినా సమస్యలే స్వాగతమిస్తున్నాయి.
డ్రైనేజీ, సీసీ రోడ్లు ధ్వంసం...
మేజర్ గ్రామ పంచాయతీ కాళ్ళకల్ సమస్యలకు నిలయంగా మారింది. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు లేకపోవడంతో అంధకారం నెలకొంది. సీసీ రోడ్లపై గుంతలు ఏర్పడడంతో వర్షం పడి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. డ్రైనేజీ పేరుకుపోయి విపరీతమైన దుర్వాసన వస్తుందని 3వ వార్డు ప్రజలు విమర్శిస్తున్నారు.
దీనికితోడు పరిశ్రమల నుండి వచ్చే ఘాటు వాసనలకు రాత్రుల్లో నిద్ర పట్టక ఆరోగ్యం క్షీణిస్తుందన్నారు. పేరుకే పారిశ్రామిక ప్రాంతంగా పేరుపొందినా గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు అనేక అసౌకర్యాలు ఉన్నాయి. జీవనభృతి కోసం నాలుగు రాష్ట్రాల నుండి బతుకుదెరువు నిమిత్తం కాళ్ళకల్లో నివాసం ఉంటున్నారు. స్థానికులు అలాంటి వారికి బాసటగా నిలిచి చేదోదువాదోడుగా ఉంటున్నారు.
ఇలాంటి క్రమంలో సరైన వసతులు లేక స్థానికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కో వలసి వస్తుందని వాపోతున్నారు. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో కాళ్ళకల్ ఒకటి. ఇలాంటి ప్రాంతాన్ని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరైన క్రమంలో నిధులను సమకూర్చ లేకపోయిందని, అభివృద్ధి కుంటు పడిందని విమర్శిస్తున్నారు. గ్రామంలోని అసౌకర్యాలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ఎక్కడ చూసినా, ఏ వీధిలో చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి పందులు, వీధి కుక్కలు స్త్వ్రర్యి విహారం చేస్తున్నాయని, తద్వారా విష జ్వరాలు సోకుతున్నాయన్నారు, ఇండస్ట్రీస్ పరిశ్రమల గొట్టాల ద్వారా వచ్చే దుర్వాసనలు సమీప ప్రాంతాలలో నిండి పోతుందన్నారు, వీధి దీపాలు లేక కాలనీలలో అంధకారం నెలకొంటుందని, దీనివల్ల దొంగల భయం కూడా ఏర్పడుతుందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాళ్ళకల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
పట్టించుకునేటోళ్లు లేరు..
కాళ్ళకల్ గ్రామాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. పారిశ్రామిక ప్రాంతమైనా సౌకర్యాలు ఏమీలేవు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో పల్లెల్లో పడకేసిన పారిశుధ్యంతో వ్యాధుల ముప్పు పొంచి ఉంది. సీసీ రోడ్లు, మురికి కాలువలు ధ్వంసం కావడంతో ప్రజలు పడే బాధలు వర్ణణాతీతం. కార్యదర్శులు చేతులెత్తేశారు. కనీసం తమ బాధ చెప్పుకుందామంటే వినేవారు కరువయ్యారు.
కిరణ్, కాళ్ళకల్
సౌకర్యాలు కల్పించండి...
కాళ్ళకల్ మేజర్ గ్రామ పంచాయతీ అయినా ఎలాంటి సౌకర్యాలు లేవు. కనీసం వీధుల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడం లేదు. ఎక్కడ చూసినా చెత్తాచెదారం, పందులు, కుక్కలతో కొట్టుమిట్టాడుతున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది పట్టించు కోవడం లేదు. ప్రత్యేక అధికారులు వస్తున్నారో లేదో అర్థం కావడం లేదు. మా బాధలు ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా మా సమస్యలు తీర్చండి.
నీతికుంట సురేశ్, కాళ్ళకల్