13-08-2025 12:00:00 AM
కొందరి గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా వృథా. కాని, అలాంటి వారు ఎప్పుడు, ఎక్కడ ఏం మాట్లాడుతున్నారనేది అప్పుడప్పుడు గమనిస్తుండాలి. అలాంటి అప్రధాన వ్యక్తి, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్. గత రెండు నెలల కాలంలో మునీర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికా వెళ్లి రెండుసార్లు కలిశారు. అమెరికా వెళ్లినప్పుడల్లా మునీర్‌కు ఎక్కడలేని బలం వస్తుంది. పాకిస్థాన్‌లో రాజకీయ వ్యవస్థ ఉండగా, మునీర్‌తో అమెరికా అధ్యక్షుడు ఏ ప్రొటోకాల్ ప్రకారం మంతనాలు జరుపుతున్నారనేది వేరు ప్రశ్న. ట్రంప్ ఏమైనా చేయవచ్చు. అమెరికా పర్యటనలో మునీర్ ఎన్ని అవాకులు, చవాకులు పేలినా ట్రంప్ యంత్రాంగం తప్పుపట్టదు.
ఎందుకంటే పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని గద్దె దించి, ఇటీవల ఆపరేషన్ సిందూర్‌తో చావుదెబ్బ తిన్నా.. ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి పొందిన మునీర్‌ను దేశాధ్యక్షుడిగా నియమించేందుకు రంగం సిద్ధమైందని పాక్‌లో తరచూ వదంతులు గుప్పుమంటుంటాయి. మునీర్‌కు పాకిస్థాన్‌లో ఇకపై వచ్చే పదోన్నతుల మాటెలా ఉన్నా, అమెరికా గడ్డపై నుంచి ఆయన భారత్‌కు అలవిగాని హెచ్చరికలు చేయడంపై భారత్ వెంటనే స్పందించింది.
పాకిస్థాన్‌పై భారత్ ఇకపై దాడి చేస్తే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని, సిందూ నదిపై ఆనకట్టలు కట్టినట్టయితే వాటిని క్షిపణులు ప్రయోగించి కూల్చేస్తామని మునీర్ చేసిన హెచ్చరికలు ఒకవైపు, అసలు సగం ప్రపంచాన్నే తమతో పాటు ముంచుతామన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు అమెరికాకు అభ్యంతరకరంగా కనిపించకపోవడం ఆశ్చర్యం. మునీర్ అల్లా టప్పా వ్యక్తి కాదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి రావాలని ప్రవచించిన శాంతి కాముకుడు. తమ గడ్డపై నుంచి దక్షిణాసియా విధ్వంసాన్ని కోరుతున్న ఒక సైనికాధ్యక్షుడి నోరు మూయించకుండా నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ ఎలా ఆశిస్తున్నారనేది పెద్ద ప్రశ్న.
పెంటగాన్ మాజీ అధికారి మైఖెల్ రూబిన్‌కు మునీర్ మాటలు మంటెత్తించాయి. ప్రపంచ ముందుకు మరో ఒసామా బిన్ లాడెన్ వస్తున్నాడని మునీర్‌ను ఉద్దేశించి రూబిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్‌పై దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తానని బెదిరిస్తున్న పాకిస్థాన్ చట్టబద్ధమైన దేశంగా ఉండే హక్కు కోల్పోయిందన్నారు. అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్ ఇలా అణు బెదిరింపులకు పాల్పడటం ఆమోదయోగ్యం కాదు. పాకిస్థాన్ ఒక ‘రోగ్ స్టేట్’ కాక మరేమిటని ప్రశ్నించారు.
మునీర్ మాటలు ఒక ఉగ్రసంస్థ నాయకుని మాటల్లా ఉన్నాయన్న విషయం రూబిన్ స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉండగా మునీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినందున, అరగంటలో ఆయనను అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించి, దేశం నుంచి పంపించి ఉండాల్సిందని కూడా రూబిన్ ఉన్నమాట చెప్పారు. పాకిస్థాన్‌కు అండగా నిలుస్తూ ట్రంప్, భారత్‌తో అమెరికా ఏర్పరుచుకున్న బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని కూడా రూబిన్ చెప్పడం ముదావహం. మునీర్ అమెరికా పర్యటన సందర్భంగానే, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఏఎల్)ను అమెరికా, ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం గమనించాల్సిన విషయం.