19-05-2025 06:01:16 PM
కాలువలను పూడ్చి వేస్తున్నారు..
మట్టిని చెరువులోనే ఉంచుతున్నారు..
కబ్జా చేస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మత్స్యకారులు, చెరువు పరిరక్షణ సమితి ప్రెస్ మీట్..
లక్షేట్టిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల పెద్ద చెరువుకు ఎఫ్‌టీఎల్(FTL), బఫర్ జోన్ ల హద్దులను గుర్తించాలని సోమవారం స్థానిక ఐబీలో మత్స్యకారులు, చెరువు పరిరక్షణ సమితి కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యసహకార సంఘం నాయకులు శాకపురం పోశయ్య, మేడి రాజేష్, మేడి నారాయణ చెరువు పరిరక్షణ సమితి కన్వీనర్ సప్ప రవితో పాటు పలువురు నాయకులు మాట్లాడారు. గత పదేళ్లుగా ఇటిక్యాల చెరువు అన్యాక్రాంతం అవుతుందని సంబంధిత శాఖల అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చి సమస్యను పరిష్కరించాలని కోరితే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) మత్స్యకారులు, రైతులు వైపు నిలవడం లేదని గతంలో ఏ కలెక్టర్ కు దగ్గరికి వెళ్లి సమస్యను ప్రస్తావిస్తే వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేసేవారని కానీ ఈ కలెక్టర్ మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. స్వయంగా కలెక్టర్ మమ్మల్నే మీరు మత్స్యకారులా? రైతులా? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారని, ప్రెస్ వాళ్ళను ఫోటో లు, వీడియో లు తీయవద్దు, మీరు జర్నలిస్ట్ లేనా అంటూ ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కు వినతిపత్రం ఇచ్చే క్రమంలో ఎమ్మెల్యే కంటే ముందే కలెక్టర్ సర్ది చెప్పడం, మట్టిని తడి ఆరిపోయాక తరలిస్తారు అంటూ పక్క దోవ పట్టించారన్నారు. ఇన్నిరోజులు మట్టి కుప్పలు చెరువులో ఉంచి మేం ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే తొలగించేలా చర్యలు తీసుకోవడం ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కాదా? అని మండిపడ్డారు.
స్వయంగా కలెక్టర్ మట్టిని తడిఆరిపోయాక తరలిస్తారు అని చెప్పారు కానీ నేటికీ తరలింపు ప్రక్రియ పూర్తి కాలేదన్నారు.ఇప్పటికి మట్టి తరలింపు విషయంలో కలెక్టర్ ఆదేశాలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటుకల తయారీకి అని అనుమతులు తీసుకుని మట్టిని అక్కడే ఉంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూముల్లో చదును చేసుకోవడానికేనా మట్టి తవ్వకాలు అంటూ ప్రశ్నించారు. వర్షాకాలంలో ఉండే ఎఫ్ టీ ఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్), బఫర్ జోన్ ల హద్దులు గుర్తిస్తే తమకు న్యాయం జరుగుతుందని లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చెరువును తవ్వి మట్టిని అక్కడే పోస్తున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా గంపల పల్లి చెరువు నుంచి గొలుసు కట్టు విధానం ద్వారా నీరు వచ్చే కాలువను మట్టితో నింపుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కాలువ దగ్గర పోసిన మట్టిని తొలగించడం, ఇన్ని రోజులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులకే పక్షపాత ధోరణిని స్పష్టంగా చూపుతుందన్నారు.అనుమతులకు మించి ఎక్కువ లోతులో మట్టి తవ్వకాలు చేపట్టినట్టు, ఎక్కువ మొత్తంలో మట్టిని తరలించినట్లు మత్స్యకారులు ఆరోపించారు.
గతంలో కేవలం రాత్రి మాత్రమే తవ్వకాలు జరిపేవారని ఇప్పుడు పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు జరిగితే అధికారులు ఎందుకు స్పందించడం లేదన్నారు? మత్స్య కారులకు, రైతులకు చెరువు పరిరక్షణ విషయంలో న్యాయం జరుగకపోతే హైడ్రా తో పాటు, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. గతంలో ఎఫ్ టీ ఎల్ సర్వే చేసినప్పుడు టాకీసు దగ్గర వరకు వచ్చిన హద్దులు నేడు టాకీస్ కు వందల మీటర్ల దూరంలో ఉంటాయని ఇరిగేషన్ ఏ ఈ ప్రణీత్ చెప్పడం పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. నిజమైన ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లను గుర్తించకపోతే న్యాయస్థానం మెట్లు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.
కలెక్టర్, ఎమ్మెల్యే పట్టించుకోవాలి..
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు చెరువు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ హద్దుల విషయంలో పట్టించుకుని పారదర్శకంగా పనులు జరిగేలా చూడాలని మత్స్యకారులు, రైతులు విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏండ్ల నుంచి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వీడటం లేదని విమర్శించారు. ఇప్పటికైనా కలెక్టర్, ఎమ్మెల్యే మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మత్స్య సహకార సంఘం నాయకులు రాజేష్, పోశయ్య, భీమయ్య,నారాయణ అంజన్న, చెరువు పరిరక్షణ సమితి కన్వీనర్ సప్ప రవి, మత్స్య కారులు గంగారాం, సత్తయ్య, నర్సయ్య, శ్రీకాంత్, వెంకటేష్, సత్యనారాయణ, నర్సయ్య, శంకర్, శ్రీనివాస్, స్వామి, కిరణ్, ఇందయ్య, నరేష్, చంద్రశేఖర్, రాజయ్య తో పాటు సుమారు 100 మంది మత్స్యకారులు, రైతులు పాల్గొన్నారు.