04-02-2026 12:54:27 AM
తగ్గిన భక్తుల రద్దీ
నేడు తిరుగువారం పండగ
జాతర విజయవంతం అయ్యింది: సీతక్క
ములుగు/మేడారం, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గత నెల 28 నుంచి 31 వరకు అత్యంత ఘనంగా జరిగింది. దాదాపు కోటి 80 లక్షల మంది భక్తులు జాతరకు వచ్చినట్లు అంచనా. భక్తులను అనుగ్రహించిన వన దేవతలు 31న తిరిగి వన ప్రవేశం చేశారు. వన దేవతలను మదినింపుకున్న లక్షలాది మంది భక్తులు ఇళ్లకు తిరుగు ముఖం పట్టారు. దీంతో మేడారంలో భక్తుల రద్దీ తగ్గింది.
ఈ నేపథ్యంలో బుధవారం జాతర ముగింపు వేడుకగా తిరుగు వారం పండుగ నిర్వహిస్తారు. ఆదివాసి గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చి వన దేవతలు కొలువైన గద్దెలను శుద్ధి చేసి, ఆదివాసి సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా వనదేవతలకు పూజలు చేస్తారు. డోలు వాయిద్యాలు, నృత్యాలతో అత్యంత ఘనంగా నిర్వహించే తిరుగువారం పండగలో పెద్ద ఎత్తున ఆదివాసి గిరిజనులు పాల్గొంటారు. వనదేవతలకు జాతర సందర్భంగా ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని వేడుకుంటారు. మళ్ళీ రెండేళ్లకు వచ్చే జాతరకు మళ్లీ మమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటారు.
మూడు రోజుల క్రితం వరకు లక్షల మంది భక్తులు, గుడారాలు, వాహనాలు, షాపులు, ఆర్టీసీ బస్సులు, హెలికాప్టర్ల రణగొణ ధ్వనులతో మహానగరంగా విలసిల్లిన మేడారం ఇప్పుడు బోసిపోతోంది. జన ప్రవాహంతో నిండిన జంపన్న వాగు ఇప్పుడు భక్తజన సందడి కోల్పోయింది. బుధవారం నిర్వహించే తిరుగు వారం పండుగ అనంతరం మేడారం జాతర పరిసరాలు పూర్తిగా నిర్మానుష్యం కానున్నాయి.
సజావుగా జాతర: సీతక్క
జాతర పనులు, గుడి పనులు సజావుగా జరిగాయని, కొంతమంది జాతరపై, ఏర్పాట్లపై విష ప్రచారం చేసినా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా ముగిసిందని మంత్రి సీతక్క తెలిపారు. సుమారు రెండున్నర కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వచ్చినట్లు భావిస్తున్నామని చెప్పారు. మేడారం చుట్టుపక్కల రోడ్లను వచ్చే జాతర సమయానికి వెడల్పు చేసి.. ట్రాఫిక్ జామ్‌ను నివారిస్తామన్నారు.