calender_icon.png 9 September, 2025 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిత్ర పరిశ్రమ గొప్ప పాఠాలు నేర్పింది

08-09-2025 12:56:16 AM

తాజాగా ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2025 వేడుకలు దుబాయ్‌లో ముగిశాయి. తొలిరోజు తెలుగు, కన్నడ సినిమాలకు అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. చివరి రోజైన శనివారం రాత్రి తమిళ, మలయాళ చిత్రాలకు పురస్కారాల ప్రదానం జరిగింది. తమిళం నుంచి ‘అమరన్’ ఉత్తమ చిత్రంగా, అదే చిత్రానికిగానూ ఉత్తమ నటిగా సాయి పల్లవికి పురస్కారం దక్కింది.

మలయాళం నుంచి ఉత్తమ చిత్రంగా ‘మంజుమ్మల్ బాయ్స్’, ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ (ది గోట్ లైఫ్ చిత్రం)కు అవార్డులు వరించాయి. అయితే, ఈ 13వ ఎడిషన్ సైమా వేడుకల్లో శివకుమార్, త్రిషకు ప్రత్యేక గౌరవం దక్కింది. చిత్ర పరిశ్రమకు సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్నందుకు గాను వీరిద్దరినీ ప్రత్యేక పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ.. “2012 నుంచి నేను సైమాకు హాజరవుతున్నా.

ఇది నిజంగా చాలా అభివృద్ధి చెందింది. మాకు ఇంట్లో ఉన్నట్టనిపించేలా చేస్తారు. నాలుగు పరిశ్రమల సెలబ్రిటీలు కలుసుకునే ఈ వేడుకలంటే నాకు చాలా ఇష్టం. తరచూ తమిళ అవార్డులు ఇస్తారు.. కానీ సైమా అవార్డ్స్‌లోనే ప్రతి ఒక్కరినీ చూడొచ్చు. ఇది చాలా ప్రత్యేకమైనది. ఎప్పటికీ మర్చిపోలేని క్షణాలు మాకు అందిస్తుంది. నా ప్రయాణంలో భాగమైన నా దర్శకులు, నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు.

నేను చేసిన కొన్ని చిత్రాల గురించి నేను చాలా గర్వపడుతున్నాను. కొన్ని సినిమాలు గొప్ప పాఠాలు నేర్పించాయి. నేను నిజమైన ప్రేమ ను పొందాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి ఇంకా బాగా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎల్లప్పుడూ నా వెనకాలే ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు నా ప్రియమైన శ్రేయోభిలాషులు, అభిమానులు ధన్యవాదాలు” అని పేర్కొంది.

ఇక త్రిష సినిమాల విషయానికొస్తే.. ప్రధానంగా ఈ టాలీవుడ్ స్టార్ బ్యూటీ ‘విశ్వంభర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిరంజీవి కథా నాయకుడిగా దర్శకుడు వశిష్ట ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. సోసియో-ఫాంటసీ కథతో రూపొందు తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి ప్రత్యేక కాననుకగా విడుదల కాబోతుంది.