calender_icon.png 13 August, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి పాటే బాలు నోట!

10-08-2025 01:04:43 AM

పాఠశాల గురువు తిరునగరి రామాంజనేయులు రాసిన ’కొవ్వత్తి’ కవితా సంకలనం ఉత్తమ బహుమతి దక్కించుకున్న సందర్భం.. ఆ ఆనందాన్ని పంచుకుంటూ, ఆయన కొన్ని గొప్ప కవితల్ని వినిపిస్తున్న క్షణాలు..‘నేనూ ఇలా కవిత్వం రాస్తే..!’ అనే ఆలోచన అక్కడి విద్యార్థి బృందంలోని ఓ చిన్నారి బుర్రలో చిగురించింది.

అప్పట్నుంచీ తన మదిలోని భావాలన్నీ కాగితం మీద పెడుతూ, కవన’గిరి’ శిఖరాల వైపు ప్రయాణం  ప్రారంభించాడు. కవిగా, రచయితగా తనను తాను ఈ లోకానికి పరిచయం చేసుకునే ప్రయత్నంలో అతని తొలి పాటే సుప్రసిద్ధ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గొంతులోకి దూరింది. ఆ అదృష్టం వరించిన యువ గీత రచయిత గిరి పట్ల పరిచయం ఇది.

గిరి పట్ల సొంతూరు యాదాద్రి జిల్లా గుండాల మండల కేంద్రం. తల్లిదండ్రులు బుచ్చమ్మ, మల్లయ్య గిరి డిగ్రీ చదువు కున్నారు. చిన్నప్పుడు పాఠశాలలో తెలుగు పండిట్ తిరునగరి రామాంజనేయులు, రాము లు రాసిన కవితల స్ఫూర్తితో కవితా రచనకు పురిగొల్పాయి. 8వ తరగతిలో ఉన్నప్పుడు స్కూ ల్లో నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో దేశభక్తి అంశంపై రాసిన కవిత్వానికి కంపాక్స్ బాక్స్ బహుమతిగా పొందారు.

అలా పాఠశాలలో బహుమతులు గెలుచుకోవటంతో మొదలైన సాహిత్య ప్రయాణంలో ఆకాశవాణి ‘బాలానందం’ కార్యక్రమంలో తన మినీ కవితలు ప్రసారం కావటం రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగేలా చేశాయి. ఎన్నో ప్రైవేటు ఆల్బమ్స్ కోసం భక్తి, జానపదం వంటి అన్ని రకాల పాటలు రాశారు. ముఖ్యంగా ‘జై జై జనసేన.. జయహో జనసేన’ అంటూ సాగే పాట జనసేన పార్టీ కార్యకర్తల్లో మంచి ఊపు తీసుకొచ్చింది. అది రాసిన గిరి పట్లకూ గుర్తింపు తెచ్చిపెట్టింది. 

సినీరంగంలో పాటల రచయితగా.. 

బూరెమోని వెంకటేశ్వర్లు వద్ద శిష్యరికం చేస్తూ కథా రచనలో తర్ఫీదు పొందారు. సినిమా పాటలు రాయడంలోనూ మెలకువలు నేర్చుకున్నారు. పాటల రచయితగా గిరి సినీరంగ ప్రవేశం ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ వారి ‘పుత్రుడు’ చిత్రంతో జరిగింది. ఈ సినిమాలో ‘ఆరుద్ర నక్షత్రం నీకు రక్ష కాగా..’ అంటూ గిరి రాసిన పాటను బాలసుబ్రహ్మణ్యం పాడారు.

తన తొలి సినిమా పాటను గొప్ప గాయకుడు పాడటం తన అదృష్టంగా భావిస్తారు గిరి. అయితే, బాలు గళం నుంచి వెలువడిన చివరి పాట కూడా గిరి మరో చిత్రం కోసం రాసింది కావడం యాదృచ్ఛికం. ‘నేనే ముఖ్యమంత్రి’, ‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’, ‘మల్లిక’, ‘వదలను’, ‘వస్తా’, ‘శాంతి సుబ్రమణ్యం’ వంటి చిత్రాల్లో పాటలు రాశారు. ముఖ్యంగా గిరి పాటలు రాసిన వాటిల్లో ‘14 డేస్ లవ్’, ‘డియర్ కృష్ణ’ సింగల్ కార్డ్ చిత్రాలు కావటం విశేషం. 

ప్రస్తుతం జయమాధవి కంబైన్స్, శ్రీచక్ర ఫిలిమ్స్, దిగాంత్ డే డ్రీమ్స్ ఫిలిమ్స్ తదితర సంస్థలు నిర్మిస్తున్న చిత్రాల కోసం పాటలు రాస్తున్నారు. అన్ని కాలాల వారి పాటలు వింటూ తనదైన కొత్తదనాన్ని ఆవిష్కరించినప్పుడే సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు దక్కుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్తున్న గిరి పట్ల మాటలు కొత్త రచయితలకు స్ఫూర్తిదాయకం. 

నన్ను నేను నిరూపించుకునేందుకు ముందుకు సాగుతున్నా: గిరి పట్ల, సినీ గీత రచయిత 

పాఠశాల విద్యనభ్యసించే రోజుల్లో మా తెలుగు ఉపాధ్యాయుల కవితలు చదివి సాహిత్య పఠనం, రచన వైపు ఆసక్తి పెంచుకున్నాను. కళాశాల స్థాయిలో సినిమా పాటలు బాగా వినేవాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్‌ల పాటలు నాలోని గేయ రచయితకు దారులయ్యాయి.

రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్ వంటి ప్రతి రచయిత సాహిత్యాన్నీ గమనిస్తూ అందులో ఉన్న అర్థాలను గ్రహిస్తుంటాను. నాడు నేడు అన్న తేడా లేకుండా పెద్దల పాటలు వింటూ, కాలానికి అనుగుణంగా రచనల్లో వస్తున్న మార్పులను గమనిస్తుంటాను. సాహిత్య విలువలను కాపాడుకుంటూ, ప్రస్తుత సినిమాలకు అవసరమైన కమర్షియల్ విలువలతో కూడిన పాటలు రాస్తూ నన్ను నేను నిరూపించుకునేందుకు పాటల ప్రయాణం సాగిస్తున్నాను.