10-08-2025 01:06:15 AM
టాలీవుడ్ పేరు అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర భాషల్లోని అగ్ర తారలు సైతం తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ముద్దుగుమ్మలు తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ.. ఇక్కడి ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు.
ఇప్పటికే దీపికా పదుకొణె, అనన్య పాండే, జాన్వీకపూర్ వంటివారు టాలీవుడ్‌కు సుపరిచితులయ్యారు. ఇప్పుడు సోనాక్షి సిన్హా వంతు వచ్చింది. సుధీర్‌బాబు హీరోగా వెంకట్‌కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’ సినిమా ద్వారా సోనాక్షి సిన్హా తెలుగు తెరపై తొలిసారి మెరవనుంది.
ఇప్పటికే బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనాక్షి ఇప్పుడు టాలీవుడ్‌లోనూ నటిగా నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది. ఆమె శక్తిమంతమైన కీలక రోల్ చేస్తున్న ‘జటాధర’ ఇంకా విడుదల కాలేదు. ఈ సినిమా ఇంకా సెట్స్‌పై ఉండగానే సోనాక్షి ఇప్పుడు మరో తెలుగు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
ఈ భామ టాలీవుడ్ హీరో సరసన నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో ఈ అమ్మడు పాత్ర ఎంతో కీలకంగా, శక్తిమంతంగా ఉండనుందట. ఈ సినిమాను ఇక్కడి ఓ అగ్ర నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించనుందని టాక్. ఏదేమైనా మొదటి సినిమా విడుదల కాకుండానే సోనాక్షికి తెలుగులో మరో అవకాశం రావటం చెప్పుకోదగ్గ ముచ్చటే!