calender_icon.png 28 July, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్లా పెట్టె ఊడ్సుకతిన్నరు

28-07-2025 12:00:00 AM

-పదేండ్లల్ల ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే

-ఊరుకు పదిండ్లు కట్టియ్యలే

-కాంగ్రెస్ వచ్చినంకనే పేదలకు ఇండ్లు, రేషన్ కార్డులు వచ్చినయ్

-మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, జూలై 27 : ‘గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల గల్లా పెట్టెను ఊడ్చుకుతిన్నది. పదేండ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. పేదల కోసం ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు‘ అని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పేదలకు పథకాలు అందుతున్నాయన్నారు. ‘మేము అధికారంలోకి రాగానే, జిల్లా వ్యాప్తంగా 26 వేల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశాం. 816 ఇండ్లను  కేటాయించాం‘ అని అన్నారు. హుస్నాబాద్ మండలంలోనే 1279 కొత్త రేషన్ కార్డులు అందజేయగా, 506 ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు.

అక్కన్నపేట మండలంలో ఇప్పటికే ఉన్న 2061రేషన్ కార్డులలో 4369 మంది పేర్లు చేర్చామన్నారు. 1403 కొత్త కార్డులను ఇచ్చామని, అందులో 3032 మంది ఉన్నారన్నారు. అక్కన్నపేట మండలానికి 519 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామన్నారు. కోహెడ మండలంలో కూడా 1117 రేషన్ కార్డులు, వడ్డీలేని రుణాలు, 41 మంది వధూవరులకు కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్టు మంత్రి వివరించారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే రూ.1జరిమానా

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే రూ.1 జరిమానా విధిస్తామని మంత్రి అన్నారు. ప్రజల ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం, ఆరోగ్య సంరక్షణ కోసం 60కి పైగా మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్లను పంపిణీ చేశామన్నారు.

రూ.8 కోట్ల విలువైన సోలార్ యూనిట్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలుచేస్తున్నామన్నారు. అనంతరం ఆయన తంగళ్లపల్లిలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కలెక్టర్ హైమావతితో కలిసి వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.