28-07-2025 07:23:33 PM
జీరో పర్మిషన్ తో మల్లంపేట్ లో ఐదు అంతస్తుల నిర్మాణ భవనం...
2024 జులై లో గ్యాస్ కట్టర్ తో స్లాబులు కూల్చివేసిన అధికారులు
2025 జులై లో తిరిగి అదే అక్రమ నిర్మాణంలో చకచకా పనులు...
మల్లంపేట్ లో బరితెగిస్తున్న అక్రమ నిర్మాణదారులు
దుండిగల్ మున్సిపల్ అధికారులు ఉన్నట్టా..? లేనట్టా..?
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): మల్లంపేట్ లో జీరో పర్మిషన్ తో హెచ్ఎండిఎ 100 పీట్ల రోడ్డును ఆక్రమించి ఓ నిర్మాణ సంస్థ యదేచ్చగా ఐదు అంతస్థుల నిర్మాణానికి బరితెగించింది. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న చందంగా, అక్రమార్కులు, అధికారులు ఒక్కటై సర్కారుకు రావాల్సిన రాబడిని దర్జాగా దోచేస్తూ అక్రమ నిర్మాణాలను సక్రమం చేస్తున్నారన్న అపవాదు లేకపోలేదు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేట్ మాదాసు రామచంద్ర కాలనీ ఖాజీపల్లికి వెళ్లే 100 పీట్ల ప్రధాన రహదారిని ఆవరించి సర్వే నెంబర్ 172,ప్లాట్ నెంబర్ 88,89 లలో ఓ నిర్మాణ సంస్థ జీరో పర్మిషన్ తో ఐదు అంతస్థుల నిర్మాణం చేపడుతున్నారు. అప్పట్లో 2024 జులై లో అట్టి అక్రమ నిర్మాణాన్ని అప్పుడు కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణ, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది తో కూల్చివేతలు చేపట్టారు.అదే అక్రమ నిర్మాణం, ఇప్పుడు సక్రమమై తిరిగి 2025 జులైలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణానికి జీరో పర్మిషన్ ఉందంటూ గత సంవత్సరం జులై నెలలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది గ్యాస్ కట్టర్లతో స్లాబ్ లు సైతం కూల్చివేశారు.
కానీ తిరిగి 2025 జులై నెలలో పనులు పునఃప్రారంభం అయ్యాయి. అప్పుడు అక్రమమని కూల్చివేసిన అక్రమ భవనం,ఇప్పుడు చక చక పనులు జరుగుతూ ఎందుకు మెరుగులు దిద్దుకుంటుందోనని స్థానిక ప్రజలకు ప్రశ్నర్థకంగా మారింది. మున్సిపాలిటీలో అధికారులు మారినా కూడా అక్రమ నిర్మాణాల దందా మాత్రం మారడం లేదని,సంవత్సరం గ్యాప్ లో నిర్మాణదారులకు, మున్సిపాలిటీ అధికారులకు ఏమైనా ఒప్పందాలు అయ్యాయేమో అంటూ పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఈ తతంగామంతా టౌన్ ప్లానింగ్ సిబ్బంది నడిపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఏదీ ఏమైనా అట్టి జీరో పర్మిషన్ తో పనులు జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని కూల్చివేతలు చేపట్టి స్థానిక ప్రజలలో కలుగుతున్న సందేహాలు తీర్చే భాద్యత దుండిగల్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఎంతైనా ఉందని, అక్రమ నిర్మాణాన్ని సక్రమం చేస్తారా, లేక పౌరుల సందేహాలను తీరుస్తారా వేచి చూడాలి మరి. ఇదే కాకుండా మల్లంపేట్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే దారిలో ఏకంగా ఐదు అంతస్థుల అక్రమ నిర్మాణం జరుగుతున్నప్పటికి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు అధికారులను విమర్శిస్తున్నారు.అమ్యాయాలకు అలవాటు పడిన దుండిగల్ టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలకు దూరంగా ఉంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.