28-07-2025 07:06:52 PM
జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి(District Additional Collector Deepak Tiwari) అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ మండలంలో పర్యటించి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. ఇందులో భాగంగా అడ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, జనకాపూర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఆర్ ఆర్ కాలనీ, యు ఆర్ ఎస్ ఆర్ ఆర్ కాలనీలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.
హాజరు రిజిస్టర్ ను పరిశీలించి వైద్యులు, సిబ్బంది విదుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, సమయపాలన పాటించాలని తెలిపారు. నిరుపేదలకు ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని, లబ్ధిదారులు వినియోగించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పోషకాహారాన్ని అందించాలని, విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని ఇవ్వాలని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యాబోధన పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.