calender_icon.png 29 July, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి అర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టండి

28-07-2025 07:56:00 PM

హాస్టల్స్ లో  ఆహారం, తాగునీరు, పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలనుండి వచ్చిన అర్జీలను పెండింగ్ లో లేకుండా వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులు, పలువురు తహసీల్దార్లతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజలు తమ అర్జీలను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ప్రజలు అందజేసిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రజలు 283 వినతులను అందజేశారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ ఆయా శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. 

ప్రజావాణి అర్జీల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, హాస్టల్స్ తనిఖీ, పర్యవేక్షణ, తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు ఇటీవలి వరకూ హాస్టల్స్ తనిఖీ  చేసినప్పుడు అక్కడ గుర్తించిన అంశాలు, సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన వినతులను సంబంధిత శాఖల అధికారులు పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా జిల్లా అధికారులు పర్యవేక్షణకు  తమకు కేటాయించిన హాస్టల్స్ కు తనిఖీ కి వెళ్ళినప్పుడు బేసిక్ చెక్ లిస్టు ప్రకారం వసతులు ఉన్నాయా లేదా అనేది జిల్లా అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఇప్పటి వరకూ తనిఖీ చేయగా ఆయా హాస్టల్స్ లో ఏయే అంశాలను, సమస్యలను గుర్తించారని వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలువురు తహసీల్దార్లతో కలెక్టర్ మాట్లాడారు. హాస్టల్స్ లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, తాజా కూరగాయలు వండే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి హాస్టల్ నుండి చెత్త తరలింపు జరగాలన్నారు. తప్పనిసరిగా డ్రై డే (శుక్రవారం)కార్యకలాపాలు అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని సరిచేయాలని అన్నారు. గతేడాది ఇబ్బందులు ఏర్పడిన ప్రాంతాలను సందర్శించాలని సూచించారు. హాస్టల్స్ లో ఫుడ్, వాటర్ సప్లై బాగుందా లేదా అనేది తప్పనిసరిగా అధికారులు తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మండలాల పరిధిలోని గ్రామాలలో వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు.

మండల ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి ని పరిశీలించి ఇండ్ల నిర్మాణాలు త్వరగా చేసేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వినతులను సమర్పించేందుకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అందుకు తగిన ఏర్పాట్లను చేశారు. ప్రజావాణి దరఖాస్తు సమర్పించిన వారికి రిసిప్ట్ ను ఆలస్యం లేకుండా అందించేందుకు అదనపు సిబ్బందిని నియమించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సాఫీగా వినతులను సమర్పించే విధంగా సిబ్బందిని కేటాయించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేష్, డిఆర్డిఓ మేన శ్రీను, హనుమకొండ ఆర్డిఓ  రాథోడ్ రమేష్, జిల్లా అధికారులు, పలువురు తహసిల్దార్లు పాల్గొన్నారు.