31-12-2025 01:36:08 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),డిసెంబర్30: వైకుంఠ ఏకాదశి వేడుకలు మంగళవారం మండలంలో అత్యంత వైభవంగా జరిగాయి. రంగురంగుల విద్యుత్ దీపాలు, పుష్పాల అలంకరణలతో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆధ్యాత్మిక శోభతో కలకలలాడాయి. పవిత్ర పర్వదినం కావడంతో భక్తులు తమ దైవాన్ని దర్శించుకునేం దుకు వేకువజాము నుంచే దేవాలయాల బాట పట్టారు.మంగళ వాయిద్యాల మధ్య తెరుచుకున్న ఉత్తర ద్వారం నుంచి ఆలయ ప్రవేశం కోసం భక్తజనం బారులు తీరారు.
జాజిరెడ్డిగూడెం గ్రామంలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, తిమ్మాపురం గ్రామ శివారులోని సూర్యనారాయణ స్వామి మహా క్షేత్రంతో పాటు వివిధ గ్రామాల్లో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి, సర్పంచ్ బింగి కృష్ణమూర్తి, సూర్యక్షేత్రం వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్ధన్ స్వామి, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, ప్రజా ప్రతినిధులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
అత్యంత వైభవంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవములు
మఠంపల్లి డిసెంబర్ 30: మఠంపల్లి మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము మట్టపల్లి మహక్షేత్రములో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా మంగళవారము ఉదయం గం. 5-.00 లకు వేదమంత్రాలతో శ్రీ స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనము అత్యంత వైభవముగా నిర్వహించబడింది. తదుపరి శ్రీ స్వామి వారికి విశేష అర్చనలు లక్ష ఆరేపత్రి పూజ కొత్త వెంకటనరసింహారావు ముత్యాలంపాడు వారిచే నిర్వహింపబడింది. మట్టపల్లి మాడ వీధుల్లో శ్రీ స్వామి వారి గరుడ సేవ ఊరేగింపు భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. గ్రామమంతా భక్తి శ్రద్ధలతో నిండిపోయి జయజయధ్వానాల మద్య ఉత్సవం కొనసాగింది.
ఈ ఉత్సవములలో హరికథలు, బుర్రకథలు, సంగీత కచేరీలు మొదలగు సాంస్కృతిక కార్యక్రమములు అత్యంత వైభవముగా జరిగాయి. అన్నదాన సత్రముల కమీటీల వారు చౌటపల్లి, బక్కమంతుల గూడెం గ్రామ ప్రజలు స్వచ్చందంగా అన్నదానము ఏర్పాటు చేశారు. భక్తలు ఈ ఉత్సవములో వేలాది సంఖ్యలో శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. ఇట్టి కార్యక్రమములో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, కార్యనిర్వహణాధికారి బి.జ్యోతి, గ్రామ సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు, ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.