02-08-2025 08:49:09 PM
ప్రతి కుటుంబానికి నెలకు సగటున 1200 రూపాయల విలువ గల సన్న బియ్యం ఉచితంగా అందిస్తున్నాం
వీ హబ్ ఉప కేంద్రం పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు
మహిళల కోసం మంథని సమీపంలో ప్రత్యేక పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు కృషి
మంథనిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ, మహిళా శక్తి సంబరాల్లో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు
మంథని (విజయక్రాంతి): పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సాగుతోందని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) కోరారు. శనివారం మంథని ప్రాంతంలో మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ, మహిళా శక్తి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డుల జారీ చేయాలని ప్రతిపక్షంలో అనేక సందర్భాలలో ధర్నాలు చేసినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులకు నూతన రేషన్ కార్డులతో పాటు 50 నుంచి 60 రూపాయల విలువ చేసే సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, రేషన్ ద్వారా దొడ్డు బియ్యం సరఫరా చేయడం ద్వారా రీసైక్లింగ్ గురై అక్రమార్కులు మాత్రమే బాగుపడ్డారని, నేడు సన్న బియ్యం సరఫరా పేద ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి కుటుంబానికి సగటున నెలకు 1200 రూపాయల విలువ గల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు. రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ కార్యక్రమం సక్రమంగా చేయాలని, పేద ప్రజలకు నాణ్యమైన విద్య అందించడం కోసం పెద్ద ఎత్తున ఆదర్శ పాఠశాలలను మన హయాంలో ఏర్పాటు చేశామని మంత్రి గుర్తు చేశారు.
వేములవాడ రాజన్న, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి, సమక్క సారలమ్మ జాతర వెళ్లడానికి, రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేందుకు ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం సౌకర్యం కల్పించిందని, ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే మహిళలకు ఇప్పటి వరకు 200 కోట్ల పైగా జీరో టికెట్లు జారీ చేసి 6680 కోట్ల రూపాయలు మహిళల తరఫున ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. పేద ప్రజల కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా సరఫరా చేస్తున్నామని, మహిళలకు వడ్డీ లేని రుణాల పథకం డబ్బులను గత ప్రభుత్వం జమ చేయ లేదని మంత్రి విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమం మళ్ళీ ప్రారంభించామని, మహిళలు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందేందుకు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్క్ మహిళల కోసం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
మహిళలకు వ్యాపార నైపుణ్యాలలో శిక్షణ అందించేందుకు వీ-హబ్ ఉప కేంద్రం పెద్దపెల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద డైయిరీ, పౌల్ట్రీ ఫార్మ్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. మహిళలకు మంథని లో కుట్టు మిషన్ శిక్షణ అందిస్తున్నామని, రాబోయే కాలంలో కొన్ని కంపెనీలను ఇక్కడ ఏర్పాటు ప్రతిపాదనలు ఆలోచిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పన పనులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టామని, రైతు సోదరులకు ఒకే సంవత్సరంలో 21 వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి 2 లక్షల రుణ మాఫీ పూర్తి చేశామని అన్నారు. 9 రోజుల వ్యవధిలో 9 వేల కోట్ల రైతు భరోసా సోమ్ము విడుదల చేశామని అన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంచామని, మొదటి సంవత్సరంలో 60 వేల నిరుద్యోగ యువతకు ప్రభుత్వ నియామక పత్రాలు పంపిణీ చేశామన్నారు.
ప్రైవేట్ రంగంలో యువతకు ఉపాధి కల్పించాలని గతంలో ఎన్నడు లేని విధంగా భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం జరిగిందని అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. మంథని నియోజకవర్గ పరిధిలో మొదటి దశలో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. చివరి లబ్ధిదారుడి వరకు ఇల్లు చేరేలా ఇందిరమ్మ ఇండ్ల పథకం కొనసాగుతుందని, ప్రతి సంవత్సరం నూతనంగా ఇండ్లు మంజూరు చేస్తామని ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు. ఇండ్ల స్థలాలు లేని నిరు పేదలకు ప్రభుత్వ భూములను కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు కట్టించే సంకల్పం చేస్తున్నామని, అడవి సోమన పల్లి లో 200 కోట్లు ఖర్చు చేసి కార్పొరేట్ స్థాయికి దీటుగా ఉండేలా ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణం చేస్తున్నామని, గురుకులాల్లో చదివే పిల్లలకు 40 శాతం డైట్ చార్జీలు పెంచామన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ గత 20 నెలల కాలంలో ప్రభుత్వం అన్ని రంగాలలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.
ప్రభుత్వం మహిళలకు అందించిన ప్రాధాన్యత పై సంబరాలు చేసుకుంటూ భవిష్యత్తులో మహిళల అభ్యున్నతికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి మహిళా శక్తి సంబరాలు జరుపుకుంటున్నామని అన్నారు. జిల్లాలో నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డుల ద్వారా 25 వేల పైగా ప్రజలకు లబ్ధి పొందనున్నారని తెలిపారు. రేషన్ కార్డు జారీ నిరంతర ప్రక్రియ గా కొనసాగుతుందని, ప్రజలు నేరుగా ప్రజా పాలన కేంద్రాలు, మీ సేవా సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకుంటే విచారించి అర్హులకు రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు రామగిరి, మంథని, ముత్తారం, కమాన్ పూర్ మండలాలకు చెందిన 2389 స్వశక్తి మహిళా సంఘాలకు రూ. 2 కోట్ల 37 లక్షల వడ్డీ రాయితీ చెక్కు, సహజంగా మరణించిన 17 మంది సంఘ సభ్యులకు 14 లక్షల 66 వేల 344 రూపాయల లోన్ బీమా చెక్కు, ప్రమాదవశాత్తు మరణించిన ఒక మహిళా సంఘ సభ్యురాలి కుటుంబానికి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కు, 385 శివశక్తి మహిళా సంఘాలకు 30 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా మూడు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అంతకుముందు మంథని పట్టణం లో పెట్రోల్ బంక్ ఏరియా ,పెద్దపల్లి రోడ్డు, గోదావరిఖని రోడ్డులో 6 కోట్ల 70 లక్షల రూపాయలతో నెలకొల్పిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను, రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో రూ. 2 కోట్ల 60 లక్షల రూపాయల నిధులతో కల్వచర్ల నుంచి లోంక కేశారం వరకు నిర్మించిన సిసి రోడ్డు ను మంత్రి ప్రారంభించారు. మంథని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంథని పట్టణంలో రూ. 20 కోట్ల 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే 410 ఇందిరమ్మ ఇండ్ల పైలాన్, 7 గ్రామాలలో కోటి 40 లక్షలతో నిర్మించే గ్రామపంచాయతీ భవనాలకు, ఎక్లాస్పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. 2 కోట్ల 70 లక్షలతో నూతనంగా నిర్మించబోతున్న బాయ్స్ హాస్టల్ భవనానికి మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సింగరేణి సిఎస్ఆర్ నిధుల కింద పదో తరగతి విద్యార్థులకు ఉపయోగపడే క్యూఆర్ కోడ్ పుస్తకాలు పంపిణీ చేసారు. అటవీశాఖ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.వేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ గౌడ్, ఆర్.డి.ఓ. సురేష్, తహసిల్దార్, ఎంపిడిఓ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.