02-08-2025 08:44:24 PM
పెండింగ్ బిల్లులు చెల్లింపుకు చొరవ చూపండి
రాష్ట్ర సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు అక్కెనపల్లి కరుణాకర్.
జిల్లా అధ్యక్షుడు దుమ్ము అంజనేయులు.
సిరిసిల్ల (విజయక్రాంతి): విలేకరుల సమావేశం తాజా మాజీ సర్పంచుల జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అక్కనపెల్లి కరుణాకర్ శనివారం దుమ్మ అంజయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలలు గడుస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో గత సర్పంచులచే చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
2019–24 కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు
సర్పంచుల కాలంలో వివిధ గ్రామాల్లో రైతు వేదికలు, స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, మహిళా సంఘ భవనాలు, కుల సంఘ భవనాలు, హైమాస్క్ లైట్లు, సీసీ రోడ్లు, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు, తాగునీటి కోసం ట్యాంకర్లు, మిషన్ భగీరథ పనులు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వారు గుర్తు చేశారు. ప్రజల అవసరాలకోసం తమకు లభించిన నిధులతో పాటు అప్పులు చేసి ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు.
ఆత్మహత్యలు, ఆర్థిక భారం
పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల చాలామంది సర్పంచులు ఆర్థికంగా దెబ్బతిని ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుర్విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బిల్లులు రాక అప్పుల్లో కూరుకుపోయిన సర్పంచులు తమ ఆస్తులను విక్రయించి, కుటుంబ ఆభరణాలు గిరవుపెట్టి తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, హామీల సాధనకు నిరసనలు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సర్పంచ్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం 20 నెలలుగా వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు నిర్వహించిన ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలకు ప్రతిస్పందించకుండా, తప్పుడు కేసులు పెట్టి ఉద్యమాన్ని అణచివేయడం ప్రభుత్వం తీరుగా విమర్శించారు.
సీతక్క హామీ కూడా అమలుకాకపోవడం తీవ్ర విషాదం పట్టభద్రుల సభలో పంచాయతీరాజ్ మంత్రి సీతక్క సుమారు రూ. 700 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్క బిల్లు కూడా చెల్లించకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు.
జనహిత పాదయాత్రలో సమస్యలపై సమయం కేటాయించాలి ఈ సందర్భంగా జనహిత పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజ్ గారిని ఉద్దేశించి, ఒక గ్రామాన్ని సందర్శించి 2019–24 కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాదయాత్ర సందర్భంగా సర్పంచుల సమస్యలపై మాట్లాడేందుకు సమయం కేటాయించాలని కూడా కోరారు.