22-07-2025 12:00:00 AM
వెల్దుర్తి లో దేశీ చాయి స్టాల్ ప్రారంభం
వెల్దుర్తి, జులై 21 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట హామీ ఇచ్చి 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను వంచిస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలో సోమవారం దేశి ఛాయి స్టాల్ ను ప్రారంభించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఎన్నికల ముందు ప్రతి రైతుకు పూర్తిస్థాయి రుణమాఫీ చేస్తామని నమ్మించి గద్దెనెక్కిన తర్వాత కొందరికి రుణమాఫీ చేసి చేతులు దులుపుకుందని తెలిపారు. పచ్చి రొట్టె ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మోద్దు నిద్ర పోతుందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీస విలువ ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించకుండా ఓడిపోయిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ల చేత కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గ ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని ఆరోపించారు.
చిలిపిచేడ్, కొల్చారం మండలాలకు సింగూర్ నీళ్లు విడుదల చేయాలని, కొండపోచమ్మ సాగర్ ద్వారా హల్దీ ప్రాజెక్టులోకి నీళ్లు వదిలి వెల్దుర్తి, కొల్చారం మండలాలకు మెదక్ నియోజకవర్గ రైతులకు నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో వెల్దుర్తి మండల అధ్యక్షుడు పంచభూపాల్ రెడ్డి మాజీ జడ్పిటిసి రమేష్ గౌడ్ వెల్దుర్తి మాజీ సర్పంచ్ వెన్నవరం మోహన్ రెడ్డి, మెదక్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణ గౌడ్,జెగ్గ అశోక్ గౌడ్,వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, చల్ల మహేష్, రమేష్ చందర్, మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.