28-12-2025 12:00:00 AM
బీఆర్‌ఎస్ హయాంలో
ఫార్మాసిటీ కోసం.. సేకరించిన భూములకు పరిహారం
తక్కువగా ఇచ్చింది
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా భూమిని సేకరించి.. తక్కువ నష్టపరిహారం ఇస్తే కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం చేసి నష్టపరిహారం ఎక్కువగా ఇప్పించామని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అనుకూలంగా ఉండి నష్టపరిహారంతో పాటు ఉద్యోగం, ఇంటి స్థలం కూడా ఇస్తుందని తెలిపారు. శనివారం ఆయన రైతు కమిషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ వద్దకు వచ్చి అభ్యంతరాలు చెబితే.. మార్పులు, చేర్పులు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగానే రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుం టున్నారని తెలిపారు.
గత ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే ఫార్మాసిటీ కోసం భూములు సేకరించిందన్నారు. భూ సేకరణ చేసే సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడంతో పాటు రైతుల నుంచి సేకరించే భూములకు సరైన నష్టపరిహారం కల్పించాలని ఉద్యమించడతోనే రూ.6 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు పెంచారని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వివరించారు. నిత్యం మీడియాలో ఉండే విధంగా అడ్డగోలుగా మాట్లాడటం కంటే ప్రతిపక్ష పాత్రను బీఆర్‌ఎస్ సమర్ధవంతంగా పోషించాలని ఆయన సూచించారు. సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకొస్తే పరిస్కరించడానికి సిద్ధంగా ఉందన్నారు.