15-12-2025 12:00:00 AM
మణికొండ, డిసెంబర్ 14 (విజయక్రాంతి): బుల్కాపూర్ నాలా పరిరక్షణ విషయంలో అధికారులు నిబంధనలను గాలికి వదిలేసి, బడా బిల్డర్లకు కొమ్ముకాస్తున్నారని మణికొండ బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వారు పుప్పాలగూడ అపర్ణ జినాన్ నుంచి సాస్ ఐవా, సుఖిల్ ఉబంటు, వ్యూ రెసిడెన్సీ మీదుగా బీరప్ప దేవాలయం వరకు నాలా ప్రవాహాన్ని, జరుగుతున్న పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పుప్పాలగూడ సర్వే నంబర్ 363, 364, 365 పరిధిలో సుమారు 17 గుంటల బఫర్ జోన్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దానికి బదులుగా సర్వే నంబర్ 362లోని పులిచెర్ల గడ్డకు సంబంధించిన 3 ఎకరాల ప్రభుత్వ భూమిలో తవ్వకాలు జరుపుతున్నారని, ఇది పూర్తిగా బిల్డర్లకు అనుకూలంగా వ్యవహరించడమేనని ధ్వజమెత్తారు.
ప్రజా అవసరాలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ భూమిని ఇలా ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాల కోసం బలిచేయడం సరికాదన్నారు. అలాగే పుప్పాలగూడ సర్వే నంబర్ 315లో సుమారు రూ.3 కోట్ల విలువ చేసే రెండు గుంటల ప్రభుత్వ భూమి ఆచూకీ లేకుండా పోయిందని, అది ఎక్కడ ఉందో అధికారులు వెంటనే తేల్చాలని డిమాండ్ చేశారు.
అపర్ణ జినాన్ నుంచి మణికొండ మర్రిచెట్టు వరకు బఫర్ జోన్ను స్పష్టంగా నిర్ధారించి, నాలాను పరిరక్షించకపోతే వర్షాకాలంలో మణికొండ లోతట్టు ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు సీతారాం ధూళిపాళ, గుట్టమీది నరేందర్, బొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి, అందే లక్ష్మణ్ రావు, బండమీది మల్లేష్, మహమ్మద్ ఆరిఫ్, సుమనళిని, యాలాల కిరణ్, రమణ మూర్తి, శ్రీధర్, దేవి ప్రియ, బిందు తదితరులు పాల్గొన్నారు.