03-02-2026 02:15:02 AM
శ్రీరంగాపురం ఫిబ్రవరి 2: మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ గ్రంథాలయం శిథిలావస్థకు చేరి ప్రజల ఆందోళనకు కారణమవుతోంది. విద్యా, సాంస్కృతిక అభివృద్ధికి కీలకమైన ఈ గ్రం థాలయం ప్రస్తుతం సరైన నిర్వహణ లేకుండా దయనీయ స్థితిలో ఉంది. భవనం పైకప్పు చీలికలు పడి, గోడలపై చెదలు పట్టి వర్షాకాలంలో నీరు లోపలికి చేరుతోంది. పాత ఫర్నిచర్, చిరిగిన పుస్తకాలు, పనిచేయని ఫ్యాన్లు,లైట్లు పాఠకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.ప్రత్యేకంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ప్రశాంత వాతావరణం లేక చదువుకు దూర మవుతున్నారు. గ్రంథాలయానికి వస్తే కూర్చోవడానికి సరైన కుర్చీలు కూడా లేవు. పుస్తకాలు పాడైపోతున్నాయి అని పలువురు విద్యార్థులు వాపోతున్నారు.
రోజురోజుకూ పాఠకుల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. ప్రభుత్వం గ్రంథాలయానికి సరైన నిధులు కేటాయించక పోవడమే ఈ దుస్థితికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం భవన మరమ్మతులు, కొత్త పుస్తకాల సమకూర్పు, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలని డిమాండ్ చేస్తు న్నారు.ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి గ్రంథాలయా న్ని పునరుద్ధరించకపోతే విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.