14-07-2025 01:05:54 AM
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే జారె
ములకలపల్లి, జూలై 13 ( విజయ క్రాంతి).:రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ములకలపల్లి మండలం పూసుగూడెం లో నిర్మించిన పంప్ హౌస్ నెంబర్ 2 ద్వారా సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ పంపుల ద్వారా నీటిని దిగువ ప్రాంతాలైన ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని రైతులకు వ్యవసాయ అవసరాల కోసం సాగునీటిని విడుదల చేశారు. పంప్ హౌస్ ద్వారా సాగునీటి విడుదలకు ముందు పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కష్టాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుంటూ ప్రతి ఎకరం పండాలని ప్రతి రైతు కు టుంబం సంతోషంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సాగునీటి అవసరాలను తీర్చేందుకు తక్షణమే చర్యలు తీసుకుని దిగువకు సాగునీటిని విడుదల చేయడం జరిగిందన్నారు.
అనంతరం ములకలపల్లి లో థూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సర్వతో ముఖా భివృద్ధిని కాంక్షిస్తూ ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు హైదరాబాదులో నిర్వహించనున్న పంచ కుండాత్మక చండి కుబేర పాశుపతయాగ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు , మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి, పువాల మంగపతి, గాడి తిరుపతి రెడ్డి, కరుటూరి కృష్ణ, సురభి రాజేష్, శనగపాటి రవి, పలుశాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.