14-07-2025 01:04:14 AM
జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్
భద్రాద్రికొత్తగూడెం, జులై 13, (విజయక్రాంతి): జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి వెంటనే నెరవేర్చాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన అసెంబ్లీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కూడా కీలకంగా కొన సాగిందని గుర్తుచేశారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర గడిచినా ఇంతవరకూ ఆ ఊసే ఎత్తడం లేదని,ఇది సరైన పద్ధతి కాదని మండిపడ్డారు.
ప్రభుత్వానికీ ప్రజలకూ మధ్య వారిధి గా పని చేస్తూ వృత్తి పరంగా అనేక ఒడి దుడుకులు ఎదుర్కొంటున్న విలేఖరులు జీతభత్యాలు లేక కుటుంబాలకు విద్యా, వైద్యం అందించలేక ఆర్థికంగా చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోతే వాళ్ళ సత్తా చూపి ప్రభుత్వానికి బుద్ధి చెబుతున్నారన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇండ్ల స్థలాలు,ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని, లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపు నిస్తామని హెచ్చరించారు. కొత్తగూడెం పట్టణంలో గతంలో జర్నలిస్టులకు కేటాయించిన ఇంటి స్థలాలను వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో చెనిగరపు నిరంజన్ కుమార్,అల్లకొండ శరత్, వినయ్, పూణెం మురళి,కిట్టు తదితరులు పాల్గొన్నారు.