27-11-2025 07:47:26 PM
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్య నాయక్..
వనపర్తి (విజయక్రాంతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్య నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఘనపూర్ మండలంలోని పర్వతాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(PPC) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి, పొరపాట్లకు తావు లేకుండా ధాన్యం సేకరించాలని సూచించారు. ధాన్యాన్ని ఎటువంటి తాలు లేకుండా కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన ట్యాబ్ ఎంట్రీని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఏ మిల్లుకు ధాన్యాన్ని ట్యాగ్ చేస్తారో ఆ మిల్లుకు మాత్రమే పంపాలని ఆదేశించారు. రవాణా కాంట్రాక్టర్లు ఆలస్యం చేయకుండా ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని, అలాగే కేంద్రాలలో రిజిస్టర్లను నిర్వహించి, సీరియల్ నంబర్ ప్రకారం ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని సూచించారు. అనంతరం, అదనపు కలెక్టర్ ఘనపూర్ మండలంలోని లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్లును కూడా తనిఖీ చేశారు. మిల్లుకు చేరుకున్న ధాన్యం లోడ్లను పరిశీలించి, మిల్లు యజమానులకు పలు ఆదేశాలు జారీ చేశారు. రైస్ మిల్లుకు ధాన్యాన్ని తీసుకువచ్చిన లారీలను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే అన్‌లోడ్ చేయాలన్నారు. లారీలు ఎక్కువ సమయం మిల్లుల వద్ద వేచి ఉండే పరిస్థితిని నివారించాలి, దీని ద్వారా ధాన్యం రవాణా ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు.