27-11-2025 07:45:33 PM
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్య నాయక్
వనపర్తి (విజయక్రాంతి): జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్య నాయక్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నాడు గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశలో భాగంగా ఘనపూర్ (Ghanpur) మండల పరిధిలోని సోలిపూర్, ఉప్పరపల్లి, మాణజిపేట, షాపూర్, ఘనపూర్, మామిడిమాడ, అప్పారెడ్డిపల్లి, ఆల్మైపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నామినేషన్ స్వీకరణ ప్రక్రియ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఓటరు జాబితాను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల్లో ఫారం 1 ప్రచురణ చేశారా లేదా అని తనిఖీ చేశారు.నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు ఒక ప్రపోజల్ మరియు మరొక వ్యక్తి – మొత్తం ముగ్గురిని మాత్రమే రిటర్నింగ్ అధికారి గదిలోకి అనుమతించాలన్నారు. ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ, పారదర్శకతతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారులకు ఆయన తగిన సూచనలు చేశారు.