పెరుగుతున్న భాగ్యన‘గరం’!
- పదేళ్లకోసారి 0.75 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల
- పట్టణీకరణే ప్రధాన కారణమంటున్న పరిశోధకులు
- భవష్యత్‌లో మరింత పెరగనున్న సిటీ జనాభా
- పర్యావరణ ప్రమాణాలను కాపాడుకునేందుకు చర్యలు అవసరం అంటున్న నిపుణులు
హైదరాబాద్, జూన్ 16( విజయక్రాంతి) : హైదరాబాద్‌లో వాతావరణ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. దేశంలో వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్ టాప్ ఉన్నట్లు తాజా అధ్యయనం చెబుతోంది. రాష్ట్ర రాజధానిలో పదేళ్లకోసారి దాదాపు 0.75డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు ఐఐటీ భువనేశ్వర్‌కు చెందిన ప్రొఫెసర్లు సౌమ్య సత్యకాంత సేథి, వినోజ్ చేపట్టిన పరిశోధనల్లో తేలింది.
వీరు దేశంలోని 141 నగరాలను పరిశీలించగా మొదటి 10 స్థానా ల్లో హైదరాబాద్ ఉన్నట్లు వెల్లడించారు. వేగంగా ఉష్ణోగ్రతలు మారుతున్న జాబితాలో 1.06 డిగ్రీల సెల్సియస్‌తో అహ్మ దాబాద్ మొదటి స్థానంలో ఉంది. 1.02 డిగ్రీలతో జైపూర్, 0.90 డిగ్రీలతో ఢిల్లీ, పు ణే, 0.81 డిగ్రీలతో బెంగళూరు, 0.78 డిగ్రీలతో నాసిక్, 0.75డిగ్రీలతో హైదరాబాద్ వరుస స్థానాల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
కాలుష్యం కూడా కారణమే..!
కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి కాలుష్య కారకాలు కూడా వాతావరణాన్ని వేడెక్కిస్తాయని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పెరగడానికి వాయు కాలుష్య స్థాయిలే కారణమని ఈ అధ్యయనం చెబుతోంది. హైద రాబాద్‌కు వాయువ్య, పశ్చిమ, దక్షిణ, ఆగ్నే య ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో కీలక మార్పులను గమనించినట్లు చెప్పారు. పటాన్‌చెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, బీఎన్ రెడ్డి నగర్, హ యత్ నగర్‌లో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు వెల్లడించారు. ఉష్ణోగ్రతల పెరుగదలకు భూగర్భ జలాలు క్షీణించిపోవడం, పచ్చదనం తగ్గిపోవడం, ముఖ్యంగా చెరువులు నానాటికీ తగ్గిపోవడమూ కారణమని నిపుణులు నొక్కి చెప్పారు.
ప్రస్తుతం భారత జనాభాలో దాదాపు 36శాతం మంది అంటే 40కోట్ల మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. 2050నాటికి అది 80కోట్లకు చేరుకుటుందని డబ్ల్యూఆర్‌ఐ ఇండియా రాస్ సెంటర్ సర్వే సంస్థ పేర్కొంది. ఫలితంగా కాలుష్యం కూడా అదేస్థాయిలో పెరిగి వాతావరణంలోనూ అంతే వేగంగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. అది భవిష్యత్ తరాలకు విఘాతంగా మారే ప్రమాదం ఉంది. అందుకే పర్యావరణ నష్టాన్ని నివారించేందుకు పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అవలంబించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు.
పట్టణీకరణే ప్రధానం
ఉష్ణోగ్రతల్లో మార్పులు వేగంగా జరగడానికి ప్రధాన కారణం పట్టణీకరణే అని పరిశోధకులు చెబుతున్నారు. కాంక్రీటు నిర్మాణల వల్ల అర్బన్ హీట్ ఐలాండ్స్ ఏర్పుడుతాయని, ఇవి ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవు తాయని వెల్లడించారు. కాంక్రీటు, తారు రోడ్లు పగటిపూట వేడిని నిల్వ చేసి సాయంత్రం విడుదల చేస్తాయి. ఫలితంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటున్నారు.






